Jeevandaan | హైదరాబాద్ కేంద్రంగా మనిషి అవయవాలు అంగట్లో సరుకుగా మారుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ పర్యవేక్షణా లోపం, కొందరు అధికారుల ధన దాహంతో ఒక పక్కన నకిలీ డాక్టర్లు పుట్టుకొస్తుండగా మరో పక్కా మానవ రవాణా తరహాలో అవయవ రవాణా సాగుతున్నట్లు అలకానంద కిడ్నీ రాకెట్ ఘటనతో తేటతెల్లమైంది. గత సంవత్సరం జూలైలో 9 పడకల సామర్థ్యంతో అనుమతి పొందిన అలకానంద దవాఖానను సుమంత్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని, అధికారికంగా కేవలం ఒక ఫిజీషియన్, ఒక సర్జన్లకు మాత్రమే ఈ దవాఖానకు అనుమతి ఉన్నట్లు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. ఇదిలా ఉండగా అనుమతిచ్చిన అధికారులు ఆరునెలలుగా దవాఖానవైపు తొంగి చూడకపోవడంతో అలకానంద దవాఖాన అవయవాల అంగడిగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 41 హాస్పిటల్స్‌కు మాత్రమే జీవన్‌దాన్ అనుమతి ఉంది. అలకానంద దవాఖానలో మాత్రం జీవన్‌దాన్ అనుమతి లేకుండానే ఎలాంటి నియమ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించకుండానే యధేచ్ఛగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరుపుతున్నారు. అయితే ఈ వ్యాపారం ఎంత కాలం నుంచి నడుస్తుందో, ఇంకా ఏయే ప్రాంతాల్లో నడుస్తుందో తెలియాల్సి ఉంది.
– సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ)/ఎల్బీనగర్
హైదరాబాద్‌లో మానవ అక్రమ రవాణా మాదిరిగానే మానవ అవయవ రవాణా వంటి అక్రమ కార్యకలాపాలు నడుస్తున్నట్లు అలకానంద ఘటనపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ గుర్తించినట్లు సమాచారం. జరిగిన ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కమిటీ సభ్యులు బుధవారం దవాఖానను పరిశీలించారు. అయితే దవాఖాన సీజ్ చేసి ఉంచడంతో బయట నుంచే పరిశీలించి, అక్కడ కిడ్నీ మార్పిడి చేయించుకున్న రోగులు, వారికి కిడ్నీ దానం చేసిన దాతలను విచారించారు.
కిడ్నీరాకెట్ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ వైద్యమండలి.. నిర్వాహకులకు నోటీసులు జారీచేసింది. ఈ క్రమంలో దవాఖాన ఎవరి పేరున రిజిస్టర్ అయ్యి ఉంది.. అక్కడ పనిచేసిన వైద్యులు వైద్యవిద్యను ఎక్కడ పూర్తిచేశారు. అసలు వారు తెలంగాణ వైద్య మండలిలో రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు మండలి ఉపాధ్యక్షులు డా.శ్రీనివాస్ తెలిపారు. కిడ్నీ మార్పిడి రాకెట్లో శస్త్రచికిత్సలు జరిపిన వైద్యుల అర్హతపై కూడా దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
అజ్ఞాత వ్యక్తి సమాచారంతో బయట పడిన కిడ్నీ రాకెట్ ఎంత కాలం నుంచి నడుస్తుందో అనే అంశంపై విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు జరుపుతోంది. అయితే అజ్ఞాత వ్యక్తి సమాచారం ఇవ్వకపోతే ఈ కిడ్నీల వ్యాపారం యధేచ్ఛగా కొనసాగేది. కనీసం కొత్తగా అనుమతి పొందిన దవాఖానలపైన కూడా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం గమనార్హం. అనుమతులు, తనిఖీలు చేయాల్సిన అధికారులు తూతూ మంత్రంగా కూర్చున్న చోట నుంచే మమ అనిపించుకోవడంతో వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని ఒక ఉద్యోగియే అంతా తానై బయటి వ్యవహారాలను చక్కబెడుతూ కోట్లకు పడిగెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా సదరు ఉద్యోగి కొందరు సంబంధిత అధికారులకు వాటాలు ముట్టజెప్పడంతో వారు కూర్చున్న చోట నుంచి లేవకపోవడంతో ఇలాంటి కిడ్నీ దందాలు, లింగ నిర్ధారణ వంటి ఉదంతాలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోగ్యశాఖ సిబ్బందే ఆరోపిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని కిడ్నీ మాఫియాలు అంగట్లో సరుకులా పేదల మూత్రపిండాలను అమ్ముకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలకు రూ.4లక్షల చొప్పున చెల్లించి అలకానంద హాస్పిటల్లో కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తితో పాటు మరో మహిళకు మార్పిడి చేసినట్లు విచారణలో తేలింది. దీనికి సంబంధించి స్కానింగ్ చేయగా ఇద్దరు మహిళలు తమ కిడ్నీలను దానం చేసినట్లు, మరో ఇద్దరు మార్పిడి చేయించుకున్నట్లు విచారణ కమిటీ నిర్ధారించింది. అయితే ఒక్కో కిడ్నీ మార్పిడి రూ.55లక్షలకు జరిపారని, అందులో రూ.4లక్షలు డోనర్‌కు, 10లక్షలు బ్రోకర్‌కు, మిగిలిన రూ.51లక్షలు నిర్వాహకులు పంచుకున్నట్లు విచారణ కమిటీ ప్రాథమికంగా గుర్తించింది. అయితే ఈ పంపకాలలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలోని సిబ్బంది ఎవరికైనా వాటా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సుల్తాన్‌బజార్: పేదరికాన్ని అడ్డుపెట్టుకొని అమాయకుల కిడ్నీలను మార్పిడికి యత్నిస్తున్న ముఠాలను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకానాథ్‌రెడ్డి, సెక్రటరీ డాక్టర్ అశోక్ బుధవారం ఓ ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నగరంలోని అలకానంద ఆస్పత్రిలో కిడ్నీల దానానికి వచ్చిన బాధితులు, కిడ్నీల మార్పిడికి వచ్చిన రోగులను, ఆసుపత్రి యజమాని సుమంత్‌ను టాస్క్‌ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకున్న ఘటన ప్రజలను, వైద్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని చెప్పారు. అక్రమంగా కిడ్నీల మార్పిడికి పాల్పడిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఇలాంటివి పున రావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు కూడా తీసుకోవాలన్నారు.