సిటీబ్యూరో : గ్రేటర్లో వాతావరణం మరోసారి వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి దాటి 40 డిగ్రీలకు చేరువ కావడంతో నగర వాతావరణం వానాకాలంలో మండు వేసవిని తలపిస్తోంది. దీంతో పగలు, రాత్రి సమయాల్లో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భానుడి ప్రతాపానికి పగలు సమయంలో బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు.
నిన్న మొన్న కురిసిన మోస్తరు వానలతో కొంత ఉపశమనం పొందిన నగర జనం మరోసారి వేసవి తాపాన్ని చవిచూడాల్సి వస్తోంది. బుధవారం నగరంలో గరిష్ఠం 39.0 డిగ్రీలు, కనిష్ఠం 28.0 డిగ్రీలు, గాలిలో తేమ 44 శాతంగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా రుతుపవనాల కదలిక మందగించడంతో ప్రస్తుతం నగరంలో మూడు నాలుగు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు.