సిటీబ్యూరో : గ్రేటర్లో భిన్న వాతావరణం నెలకొంది. ఒక పక్క ఎండలు దంచికొడుతుండగా మరో వైపు వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి నగరంలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మధ్యాహ్నం 2నుంచి 3గంటల మధ్యకాలంలో కొన్ని ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. నగరంలోని మియాపూర్‌లో అత్యధికంగా 2.50సెం.మీలు, మలక్‌పేటలో 1.60 సెం.మీలు, బన్సీలాల్‌పేటలో 1.58సెం.మీలు, హబ్సిగూడ, మూసారాంబాగ్‌లో 1.53సెం.మీలు, సికింద్రాబాద్ మోండామార్కెట్లో 1.50 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 33.1, కనిష్ఠం 24.6 డిగ్రీలు, గాలిలో తేమ 81 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసే అవకాశమున్నట్లు అధికారులు వెల్లడించారు.