నగరం ఉలిక్కిపడింది. సోమవారం గంటల వ్యవధిలో సిటీలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలు నగర వాసులను భయాందోళనకు గురిచేసింది. జవహర్‌నగర్‌లో రియల్టర్‌ను దుండగులు కాపు కాసి..కత్తులతో పొడిచి.. తుపాకులతో కాల్చి దారుణంగా హతమార్చారు. మరో ఘటనలో వారసిగూడలో ఓ యువకుడు పెండ్లికి నిరాకరించినందుకు యువతి ఇంట్లోకి చొరబడి తల్లి ముందే ఆమె గొంతుకోసి చంపేశాడు.
సిటీబ్యూరో/జవహర్‌నగర్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. కూతురును స్కూల్ వద్ద వదిలేసి తిరిగి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్న అతడిని ఆటోలో వచ్చిన దుండగులు అటకాయించి దారుణంగా హత్య చేశారు. సోమవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ కథనం ప్రకారం.. జవహర్‌నగర్ కార్పొరేషన్ సాకేత్ కాలనీలో వెంకట రత్నం(46) భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసముంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం వెంకటరత్నం తన ద్విచక్రవాహనంపై కూతురుని పాఠశాల వద్ద వదిలి ఇంటికి బయలుదేరాడు.
మార్గమధ్యలో నడిరోడ్డుపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఎదురుగా ఆటోలో వచ్చారు. అప్పటికే ఓ వ్యక్తి అక్కడ నిల్చొని ఉన్నాడు. వాహనంపై వస్తున్న వెంకటరత్నంపై రాళ్లు, కత్తులతో విరుచుకుపడ్డారు. తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఆటోలో నుంచి కత్తులతో దిగిన వ్యక్తులు.. వెంకటరత్నంను విచక్షణ రహితంగా పొడిచారు. తుపాకీతో కాల్పులు జరిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు అరుస్తూ.. ఆటో, ద్విచక్రవాహనంలో అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్లూస్‌టీం, డాగ్‌స్కాడ్‌ను రంగంలోకి దింపారు. వెంకటరత్నం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానకు తరలించారు.
మృతుడి శరీరంలో నుంచి బుల్లెట్‌ను వైద్యులు బయటకు తీశారు. దుండగులు వాడిన తుపాకీ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడు గతంలో ధూల్‌పేట, మంగళ్‌హాట్ ప్రాంతాల్లో నివాసమున్న సమయంలో రౌడీ గ్యాంగ్‌లతో తిరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పదేండ్ల కిందట జరిగిన హత్యలు, గంజాయి గుడుంబా స్మగ్లింగ్లలో అరెస్టులు, ఆర్థిక పరమైన వివాదాల్లో మృతుడు వెంకటరత్నం ఆయా రౌడీ ముఠాలతో కలిసి ఉన్నట్లు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో జరిగిన వివాదాల నేపథ్యంలోనే ప్రత్యర్థులు ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసులు పేర్కొంటున్నారు. హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా స్పష్టం కాలేదని, ఏ కారణంతో హత్య జరిగిందో ఇప్పుడే చెప్పలేమని.
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 8: పెండ్లికి ఒప్పుకోవడం లేదని ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. కత్తితో అమ్మాయి ఇంట్లోకి చొరబడి తల్లి ముందే గొంతుకోసి హతమార్చి పరారయ్యాడు. వారసిగూడ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ముషీరాబాద్ డివిజన్ బాపూజీనగర్‌లో నివాసముండే కాంతారావు, లక్ష్మి దంపతులకు పవిత్ర (19) కూతురు. ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. పవిత్రకు వరుసకు బావ అయ్యే రహమత్‌నగర్‌కు చెందిన ఉమాశంకర్ (25) టైల్స్ వేసే పనిచేస్తుంటాడు. పవిత్రను వివాహం చేసుకోవాలని భావించాడు. ఇదే విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించాడు. కూతురుని ఉమాశంకర్‌కు ఇవ్వడానికి తల్లిదండ్రులు నిరాకరించడంతో కోపం పెంచుకున్నాడు.
సోమవారం మధ్యాహ్నం ఇంట్లో తల్లీ కూతుళ్లు ఉన్న సమయంలో కత్తితో ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి తల్లి లక్ష్మీతో మాట్లాడుతూ తనకు నీ కూతురుని ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నించాడు. ‘ఎందుకు కోపంగా ఉన్నావు, పెద్దవాళ్లతో మాట్లాడాలి, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్న సమయంలో ఇలా వచ్చి దౌర్జన్యం చేయడం ఏమిటంటూ.. ప్రశ్నించారు. అప్పటికే కోపంతో ఊగిపోతూ ఉన్మాదిగా మారిన ఉమాశంకర్ కత్తిని తీసి తల్లి ఎదుట నిల్చున్న పవిత్ర గొంతు కోసి, విచక్షణ రహితంగా పొడిచాడు. క్షణంలోనే ఈ హఠాత్పరిణామంతో తల్లి షాక్‌కు గురయ్యింది. కత్తిపోట్లకు గురైన కూతురును కాపాడుకునేందుకు ప్రయత్నించింది. ఉమాశంకర్ పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పోలీసులు వెల్లడించారు.
హత్య చేసిన నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడంతో పాటు సీసీ కెమెరాల్లో నేరస్తుల సంబంధించిన కొన్ని ఆనవాళ్లు, ఆటో నంబర్‌ను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిసింది.
30ఏండ్ల నాటి ప్రతీకారంతోనే వెంకటర్నత్నం హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ధూల్‌పేట ప్రాంతానికి చెందిన సుఖ్‌దేవ్‌సింగ్ స్థానికంగా పేరుమోసిన గుడంబా డాన్. పలు కేసులతో సంబంధాలు ఉండడంతో అతడిపై అప్పట్లో రౌడీషీట్ కూడా నమోదైంది. ఆ సమయంలో సుఖ్దేవ్సింగ్కు డ్రైవర్‌గా వెంకటరత్నం పనిచేసినట్లు సమాచారం. కాగా స్థానికంగా ఉండే మరో రౌడీషీటర్ అనిల్ గ్యాంగ్‌కు, సుఖ్‌దేవ్‌సింగ్ గ్యాంగ్‌కు మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. గుడుంబా వ్యాపారం, రౌడీయిజం, దోపిడీలు, బెదిరింపులు, హత్యలు తదితర నేరాలతో పోలీసులు తమదైన శైలిలో అనిల్ గ్యాంగ్‌పై ఉక్కుపాదం మోపారు. ఆ తరువాత సుఖ్‌దేవ్ సింగ్ గ్యాంగ్‌పై కూడా పోలీసులు ఉక్కుపాదం మోపారు.
ఈ క్రమంలో ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే సుఖ్దేవ్సింగ్కి సంబంధించిన సమాచారాన్ని అప్పట్లో అతడి వద్ద పనిచేస్తున్న డ్రైవర్ వెంకటరత్నం పోలీసులకు ఇచ్చినట్లు మైనర్‌గా ఉన్న సుఖ్‌దేవ్‌సింగ్ కుమారుడు వెంకటరత్నంపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా సరే అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా తనకు పరిచయం ఉన్న ఆరుగురితో కలిసి ఒక గ్యాంగ్‌ను ఏర్పర్చుకున్నాడు. వెంకటరత్నం జవహర్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలుసుకుని, పక్కా పథకం ప్రకారం సోమవారం అతడి నివాసానికి వెళ్లి హత్యచేశాడు. అనంతరం షాహినాయిత్ గంజ్ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో షాహినాయిత్ గంజ్ పోలీసులు నిందితుడిని జవహర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.



