సిటీబ్యూరో, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ప్రతీ శుక్రవారం కొత్వాల్హౌస్లో పాతబస్తీ ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకునేందుకు అందుబాటులో ఉంటానని సీపీ సజ్జనార్ ప్రకటించారు. శుక్రవారం పురానీహవేలిలోని చారిత్రక కొత్వాల్హౌస్ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు, అక్కడ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడిన సీపీ వారి సమస్యలను విని, తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గతంలో హైదరాబాద్ సిటీ పోలీస్ ప్రధాన కార్యాలయంగా పనిచేసిన కొత్వాల్హౌస్ నగరవారసత్వంలో ఒక భాగమని, ప్రతీ శుక్రవారం ప్రజలను కలవడం ద్వారా ప్రజలతో పోలీసుల మధ్య దగ్గరి సంబంధం ఏర్పడుతుందన్నారు. స్పెషల్‌బ్రాంచ్ డీసీపీ అపూర్వారావు, సౌత్‌జోన్ డీసీపీ స్నేహమెహ్రా పాల్గొన్నారు.