వరద ముంపు నివారణకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్ట్రాటజిక్ నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) ద్వారా మొట్టమొదట రూ.10 కోట్ల వ్యయంతో పికెట్ నాలాపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో చినుకు పడితే కాలనీలు గోదారులయ్యేవి. అక్టోబర్ 2020 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదురొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఎస్ఎన్డీపీ పథకం ద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నగరంలో వరద ముంపునకు గల కారణాలను అధ్యయనం చేసి.. నివారణకు చర్యలు చేపట్టారు.
80 శాతం పనులు పూర్తి..!
పికెట్ నాలా పనులను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మొదటగా ఎస్ఎన్డీపీకి సంబంధించిన బాధ్యతను ఒకే ఒక సీఈకి అప్పగించారు. అయితే పనుల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉందని గుర్తించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు ఒకొక్క జోనల్‌కు ఒక్కో చీఫ్ ఇంజినీర్‌ను నియమించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీఈలను నియమించినప్పటికీ ప్రకృతి వైపరీత్యం కారణంగా నిర్దేశించిన సమయానికి లక్ష్యాన్ని సాధించలేదు. అయినప్పటికీ కొన్ని పనులు 80 శాతం, మరికొన్ని పనులు 70 శాతం వరకు పూర్తయ్యాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు సమస్య తలెత్తకుండా నీరు సాఫీగా వెళ్లిపోయింది.
యుద్ధ ప్రాతిపదికన రూ.985కోట్ల పనులు
ఎస్ఎన్డీపీ పథకంలో భాగంగా మొదటి దశలో రూ.985 కోట్ల అంచనా వ్యయంతో 60పనులకు శ్రీకారం చుట్టారు. అందులో 37పనులు జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా మరో 23 పనులు గ్రేటర్ చుట్టూ ఉన్న నగర కార్పొరేషన్ ప్రాంతాలకు చెందినవి. మొత్తం 60 పనుల్లో 58 పనులు ప్రారంభమయ్యాయి. మిగతా 2పనులు వివిధ కారణాలతో మొదలు పెట్టలేదు. ముందుగా వరద ప్రభా వం ఎకువగా ఉన్న ప్రాంతాల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
77.56 కిలో మీటర్ల నాలా పనులు పూర్తి
మొదటి దశలో జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల పరిధిలో 77.56 కిలోమీటర్ల పొడవు గల నాలా పనులు చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ ప్యాకేజీ-2 (బీ)లో పికెట్ నాలాపై ఎస్పీ రోడ్డు వద్ద కరాచీ బేకరీ వంతెన పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఎస్పీ రోడ్‌లోని కరాచీ బేకరీ సమీపంలోని రోడ్ క్రాసింగ్ వద్ద ఉన్న పికెట్ నాలాపై అడ్డంకి కారణంగా 2020 వర్షాకాలంలో బేగంపేట ప్రాంతంలో ఉన్న కాలనీలు ముంపునకు గురయ్యాయి. సమస్యను పరిష్కరించేందుకు ఆర్సీసీ మైనర్ వంతెన (ఒకొకటి 8.0mX3.455 మీ పరిమాణంలో రెండు) నిర్మించారు.
త్వరలోనే ముంపు సమస్య తీరుతుంది: శ్రీలత శోభన్ రెడ్డి, డిప్యూటీ మేయర్
అక్టోబర్ 2020 సంవత్సరంలో నగరంలో వరద ముంపు వలన ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన మొట్టమొదటి పని పికెట్ నాలాపై బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో పలు కాలనీల వాసులు ప్రయోజనం పొందుతారని పేరొన్నారు. త్వరలో ముంపు సమస్య తీరనున్నదని స్పష్టం చేశారు.
8వేల కుటుంబాలకు ఉపశమనం
పికెట్ నాలాపై బ్రిడ్జి పునర్నిర్మాణం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వరద పీడిత ప్రాంతాల్లో ఉపశమనం కల్పించడానికి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించడానికి దోహద పడుతుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్‌లోని దాదాపు 100 కాలనీలు ప్రయోజనం పొందుతాయి. ప్రధానంగా, అన్నా నగర్ బస్తీ, రసూల్ పురా, బీహెచ్ఈఎల్ కాలనీ, ఇక్రిసాట్ కాలనీ, సౌజన్య కాలనీ, బోయిన్‌పల్లిలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయి. సుమారు 8వేల కుటుంబాలు ఉపశమనం పొందుతాయి.
యుద్ధ ప్రాతిపదికన నాలా పనులు పూర్తి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ముంపు సమస్యను పరిషరించాలనే లక్ష్యంతో పనులను వేగవంతంగా పూర్తిచేశాం. పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భారీ వర్షాల కారణంగా సకాలంలో పూర్తి కాలేదు. అయినప్పటికీ కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపును నివారించాం. ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన పనులు 80 శాతం పైగా పూర్తయ్యాయి. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పనులను వేగవంతంగా పూర్తి చేయించారు.