శేరిలింగంపల్లి, డిసెంబర్ 21: మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఐటీ కారిడార్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ సీహెచ్ వెంకన్న, మాదాపూర్ ఫైర్ అధికారి ఫజల్ కథనం ప్రకారం… రాయదుర్గం సర్వేనం. 83 నాలెడ్డ్ సిటీలోని సత్వకు చెందిన బహుళ అంతస్తుల భవనం ఐదో అంతస్తులో డిస్ట్రిక్ 150 రెస్టారెంట్లో శనివారం తెల్లవారు జామున 6 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దాదాపు రెండు గంటలు శ్రమించి మంటలను అదుపుచేశారు. కాగా అప్పటికే రెస్టారెంట్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్ అద్దాలు, గోడలు పగిలిపోయి, పర్నిచర్ సామాగ్రి, మద్యం బాటిళ్లు, విదేశీ మద్యం బాటిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
4వ అంతస్తులో ఉన్న క్వారమ్ క్లబ్ అద్దాలు సైతం అగ్ని ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉంది. భవనం ఆపరేషనల్ మేనేజర్ పియూష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గ్యాస్ పైపులైన్ లీకేజీ కారణమని, తద్వారా మంటలు వ్యాపించి చెలరేగినట్లు ఫైర్ అధికారులు తెలిపారు.