హైదరాబాద్, ఫిబ్రవరి 2 ( నమస్తే తెలంగాణ): గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా నేపథ్యంలో పట్టణాల నుంచి గ్రామాలకు వలస వెళ్లిన వారు ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్స్ అసోసియేషన్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్ కం అకౌంట్ అసిస్టెంట్స్ క్యాలెండర్లను, డైరీలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఉపాధి హామీ పథకం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు తగ్గించి కూలీల ఉపాధికి గండికొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉపాధి హామీ కంప్యూటర్ అకౌంట్స్ అసిస్టెంట్ అధ్యక్షుడు రఫీ సయ్యద్, ప్రధాన కార్యదర్శి విజయ్, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.