ఈనెల ఒకటి నుంచే అమల్లోకి ఉచిత తాగునీటి పథకం
కంటికి రెప్పలా కంటోన్మెంట్‌ను కాపాడుకుంటాం
సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, ఫిబ్రవరి 2: కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు రాష్ట్ర సర్కారు తీపి కబురు చెప్పింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత తాగునీటి పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దానిని సర్కార్ ఆచరణలో పెట్టి చూపించింది. ఈ క్రమంలోనే బుధవారం సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఎమ్మెల్యే సాయన్న, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, వాటర్ వర్క్స్ అధికారులు, బోర్డు సీఈవో అజిత్‌రెడ్డితో కలిసి రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఉచిత తాగునీటి అమలుపై విధి విధానాలు ఖరారు చేశారు. సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కంటోన్మెంట్ వాసులకు ఉచితంగా తాగునీటి సరఫరాను అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీరు ఉచితంగా సరఫరా అమలులోకి వస్తుందని తెలిపారు. దీంతో సర్కారుపై ఏడాదికి రూ.18కోట్ల మేర ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. కంటోన్మెంట్ ప్రజలు కూడా మా బిడ్డలే, వారిని కన్నబిడ్డలుగా భావించి కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
ఈ ప్రాంత ప్రజల వైద్య సేవల కోసం బొల్లారంలో బ్రహ్మాండమైన హాస్పిటల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 25 కోట్లను మంజూరు చేసిందని, త్వరలో పనులు చేపట్టడం జరుగుతుందని వివరించారు. కంటోన్మెంట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించడం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాలన్నారు. ఈ ప్రాంత సమస్యలను తెలుసుకోకుండా, పరిష్కరించకుండా కేంద్రం మొద్దునిద్రపోతుందని విమర్శించారు. సమావేశంలో వాటర్ వర్క్స్ ఈడీ సత్యనారాయణ, ఈఎన్సీ కృష్ణ, బోర్డు మాజీ సభ్యులు లోకనాధం, పాండు యాదవ్, నళినీ కిరణ్, అనిత ప్రభాకర్, భాగ్యశ్రీ శ్యామ్‌కుమార్‌తో పాటు బోర్డు అధికారులు దేవేందర్, రాజ్‌కుమార్, శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం..
కంటోన్మెంట్ ప్రజలు నీటి సమస్యతో దీర్ఘాకాలికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ మాదిరిగా కంటోన్మెంట్లో కూడా ఉచిత తాగునీటి పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక ఎమ్మెల్యే జి. సాయన్న, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. ఉచిత తాగునీటి పథకం అమలు చేయడం ఆనందంగా ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కంటోన్మెంట్ గురించి పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
– పుష్ప, కాకాగూడ, కంటోన్మెంట్
కంటోన్మెంట్లో నీటి సమస్య తీరినట్లే..
కంటోన్మెంట్లో నీటి సమస్య పూర్తిగా తీరినట్లే. గత పాలకులెవరూ కంటోన్మెంట్ సమస్యలను, తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. దీర్ఘకాలికంగా కంటోన్మెంట్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి బిల్లులు కూడా అధికంగా వచ్చేవి. సీఎం కేసీఆర్ చొరవతో మాకు నీటి సమస్య తీరడం సంతోషంగా ఉంది. ఉచిత తాగునీటి పథకం అమల్లోకి రావడంతో మా బస్తీవాసులకు ఎంతో ఆనందంగా ఉంది.
– సౌమ్య, వాల్మీకినగర్, కంటోన్మెంట్