రవీంద్రభారతి, డిసెంబర్ 12 : కళలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందు వరుసలో ఉన్నదని, కళాకారులను అక్కున చేర్చుకుని వారికి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉందని అబ్కారీ, సాంస్కృతిక, క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతి ప్రధాన మందిరంలో నిర్వహిస్తున్న అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమాజాన్ని ఇక్కడికి తీసుకువచ్చి నాటకోత్సవాలను నిర్వహించడంపై అభినయ శ్రీనివాస్‌ను అభినందించారు. ప్రాంతాలు, భాషలు వేరైనా మనమంతా ఒక్కటే అనే ఒక మంచి సందేశాన్ని జాతీయ సమైక్యతకు స్ఫూర్తిని కలిగిస్తున్నారన్నారు. ఇలాంటి నాటకోత్సవాలతో తెలంగాణ సంస్కృతిని బయటి ప్రాంతాల వాళ్లు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. సభాధ్యక్షులుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ నాటక సమాజాలపై నేటితరానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు తడకమల్ల రామచంద్రరావు, సంగీత నాటక అకాడమీ అమృత అవార్డు గ్రహీత బీఎం.రెడ్డి, తెలుగు యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ పద్మప్రియ పాల్గొన్నారు. అంతకుముందు మధుమిత బృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించింది. అనంతరం నిర్వహించిన మణిపురి నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది.