శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 2: ఒకప్పుడు పాడుబడిన ఐదు తరగతి గదులు.. మూడు వరండాలు. చెట్లనీడన తరగతులు. అక్కడే చిన్నారులకు విద్యాబోధన.. ఎలాంటి మౌలిక వసతులు లేవు.. సరైన విద్యాసామగ్రి లేదు. టీచర్లు, విద్యార్థులకు మరుగుదొడ్లు, టాయిలెట్ల సౌకర్యం లేదు. ఇలాంటి అవసరాలు తీర్చుకునేందుకు స్థానికంగా ఉండే విద్యార్థులు తమ ఇండ్లకు పరుగులు తీసేవారు.. ఇది శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్ (మజీద్బండా) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరిస్థితి.
నేడు అదే పాఠశాలలో విద్యార్థులకు 23 తరగతి గదులు అందుబాటులో ఉన్నాయి. మరో 4 అదనపు తరగతి గదుల నిర్మాణం చివరి దశలో ఉంది. విద్యార్థులకు అధునాతన మరుగుదొడ్లు, టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి. తాగడానికి వాటర్ ఫిల్టర్లు, డిజిటల్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ఎయిడెడ్ లర్నింగ్ సిస్టమ్, ప్రొజెక్టర్‌పై డిజిటల్ విద్యాబోధన అందుబాటులో ఉంది. రంగారెడ్డి జిల్లాలోనే ఈ తరహా విద్యాబోధన అందించే ద్వితీయ పాఠశాలగా మజీద్బండా ప్రభుత్వ పాఠశాల ఎంపికైంది .
పాఠశాల నేడు ఈ స్థాయికి రావడంలో ప్రధానంగా ప్రభుత్వ సహకారంతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద విద్యాభివృద్ధికి దాతలు అందించిన చేయూత ఎంతోఉంది. స్థానికంగా ఉండే గ్రామ పెద్దలు, దాతలతో పాటు వివిధ సాఫ్ట్వేర్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల సహాయ సహకారాలు ఈ మజీద్బండా ప్రభుత్వ పాఠశాల స్వరూపాన్నే మర్చేశాయి. లక్షలు ఖర్చు పెట్టి చదివించే కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఈ పాఠశాలలో విద్యనందిస్తున్నారు. “మా ఊరు.. మా బడి” అన్న ప్రధాన లక్ష్యంతో ఎందరో సామాజిక దాతలు విద్యాపరమైన మౌలిక వసతుల కల్పనకు అందించిన చేయూతనే ఈ రోజు ఈ స్థాయికి చేర్చింది.
ప్రస్తుతం 538 మంది హైస్కూల్ విద్యార్థులు, 468 మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులు.. మొత్తం 1006 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గతేడాది 6వ తరగతి, ఈ ఏడాది 7వ తరగతులో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించారు. పరిసర ప్రాంతాల ప్రైవేట్ స్కూళ్ల నుంచి 250 మంది విద్యార్థులు ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకోవడం విశేషం. పదో తరగతిలో 87 శాతం ఉత్తీర్ణతతో ముందుకు వెళ్తుంది. నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ కోసం ప్రత్యేకంగా యూత్ ఫర్ సేవా ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థులకు చదువుతో పాటు వృత్తి విద్యా కోర్సులు, సమ్మర్ క్యాంపు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తయారీ, పెయింటింగ్, క్రీడా రంగాల్లో ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతున్నారు.
సీఎస్ఆర్ కింద దాతల చేయూత
ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతాం..
కొండాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొదట్లో అరకొర వసతులతో ఉండేది. అలాంటి పాఠశాల నేడు ఆదర్శ పాఠశాలగా అవతరించింది. ఇందుకు ప్రధానంగా ప్రభుత్వ సహకారంతో పాటు సీఎస్ఆర్ వేదికగా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు, పాఠశాలలు, స్థానిక మజీద్బండా గ్రామపెద్దలు సహకరించారు. మజీద్బండా పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తగిన సహాయ సహకారాలు అందించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి నేడు వందలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో మా పాఠశాలలో చేరుతున్నారు. చదువులతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దుతున్నాం.
– పల్లె అనంతరెడ్డి ప్రధానోపాధ్యాయులు జడ్పీహెచ్ఎస్, కొండాపూర్