సిటీబ్యూరో, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ నగర ముస్లింలు ఆదివారం చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపు హైదరాబాద్ పోలీసుల బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగింది. ఈ బందోబస్తును సిటీ పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా చార్మినార్ వద్దకు చేరుకోగానే కమిషనర్ ముస్లిం మతపెద్దలైన హఫేజ్ ముజఫ్సర్, సయ్యద్ పాషా తదితరులను పూలమాలలతో సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగరం గంగాజమునా తెహజీబ్‌కు నిదర్శనమని సీపీ అన్నారు. ఈ ఊరేగింపును పర్యవేక్షించిన వారిలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, సౌత్‌జోన్ డీసీపీ స్నేహామెహ్రా తదితరులు ఉన్నారు. సెక్రటేరియట్, బషీర్‌బాగ్‌ల వద్ద కొందరు యువకులు హల్చల్ చేయడంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా వారు వినకపోవడంతోపాటు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.