సిటీబ్యూరో, నవంబర్ 6(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బ్యాంకుకు స్పందన కరువైంది. అందుబాటులోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. కొత్త ప్రాజెక్టులు లేక టీడీఆర్ విలువ సమకూరడం లేదు. జీహెచ్ఎంసీ తరహాలో భూ నిర్వాసితులకు సాయమందించేలా హెచ్ఎండీఏ పరిధిలో కూడా టీడీఆర్ ఏర్పాటు చేశారు.
కానీ ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలో కొత్త ప్రాజెక్టులు లేక ఆదరణ కరువైంది. హెచ్ఎండీఏ డిజిటలైజ్ టీడీఆర్, లెడ్జర్ వంటి సదుపాయాలతో ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ప్లాట్‌ఫాంను రూపొందించారు. హెచ్ఎండీఏ టీడీఆర్ ద్వారా భూ సేకరణలో ఆస్తులను కోల్పోయిన బాధితులకు పారదర్శకంగా పరిహారాన్ని పొందేలా, క్రయ విక్రయాలకు వీలుగా టీడీఆర్ ఆన్లైన్ పోర్టల్‌ను అధికారులు రూపొందించారు.
కోల్పోయిన స్థలానికి మార్కెట్ ధరకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు రెట్ల వరకు టీడీఆర్‌లు పొందే వీలు ఉండగా, ఆన్లైన్లోనే భూ నిర్వాసితులు క్రయవిక్రయాలు నిర్వహించుకోవచ్చు. ఇక హెచ్ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్లన్నింటినీ వెబ్సైట్లో పొందుపరుస్తుండగా, కొనుగోలు చేసిన టీడీఆర్‌తో అదనపు నిర్మాణాలను చేయవచ్చు. కానీ హెచ్ఎండీఏ పరిధిలో ఇప్పటి వరకు ఎలాంటి భారీ ప్రాజెక్టు పనులు చేపట్టకపోవడంతో… భూ నిర్వాసితులకు ఎలాంటి టీడీఆర్ జమ చేయలేకపోయింది. ఈ క్రమంలో అట్టహాసంగా ప్రవేశపెట్టిన టీడీఆర్ బ్యాంక్… ఆరు నెలలు గడిచినా నిద్రావస్థలోనే ఉన్నది.