సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : మెట్రో టికెట్ ధరల పెంపు ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారుతోంది. నిత్యం దూర ప్రాంతాల మధ్య రాకపోకలు చేసేవారిపై ఏకంగా రూ. 15 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే ధరల పెంపుపై ఇప్పటికే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుండగా.. ఇదే సమయంలో మెట్రో నిర్వహణపై ఇకనైనా దృష్టి పెట్టాలంటూ చురకలు అంటిస్తున్నారు. నిత్యం 4.5లక్షల మంది ప్రయాణిస్తున్నా.. ఇప్పటికీ కొత్త బోగీలను ఏర్పాటు చేయకపోవడంతో.. పీక్ అవర్స్‌లో జనాల మధ్య నలిగిపోవాల్సి వస్తున్నదని, అసలే పని ఒత్తిడిలో ఉండేవాళ్లకు ఇదొక అదనపు సమస్యనే అవుతుందని, కనీసం నిలబడేంత స్థలం కూడా లేకపోవడంతో.. ప్రయాణం భారమైపోతుందని వాపోతున్నారు.
శనివారం నుంచి పెంచిన మెట్రో ధరలు అమల్లోకి రాగా, ఇప్పుడు మెట్రో సంస్థ ప్రయాణికులకు కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలపై మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్లలో వినియోగించే టాయిలెట్లను పెయిడ్ సర్వీసుగా మార్చడంతో.. మూత్ర విసర్జనకు రూ. 5 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మెట్రో స్టేషన్లు ఉండే కేఫెటేరియాలో దొరికే ఆహార పదార్థాల ధరలు మార్కెట్లో దొరికే వాటికంటే ఎక్కువే ఉన్నాయి. అయినా తప్పని పరిస్థితుల్లో ట్రాఫిక్ ఇబ్బందులను ఎందుకనీ భావించి మెట్రోలోనే ప్రయాణించాల్సిన వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
ఏడాదిన్నర కాలంగా మెట్రో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పీక్ అవర్స్‌లో పరిమితి మించి ప్రయాణికులు దూరిపోతున్నారు. వెయ్యి మందికి అవకాశం ఉండే బోగీల్లో ఒకేసారి 1200 నుంచి 1500 వందల మంది జర్నీ చేస్తుంటారని తార్నాక నుంచి మాదాపూర్ వెళ్లే ప్రయాణికుడు వివరించారు. బోగీల సంఖ్యను పెంచాలని రెండేళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. నిర్వహణ భారం పేరిట ఆ విషయాన్ని ఎల్అండ్టీ మరిచింది. దీంతో అనివార్యంగానే కిక్కిరిపోయిన బోగీల్లో ప్రయాణం చేయాల్సి వస్తన్నదని వాపోతున్నారు. ఒక్కోసారి మంచినీరు కూడా కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు.
దాదాపు 20శాతం పెంచిన ధరలు నిత్యం మెట్రో ప్రయాణికులకు మాత్రమే భారంగా మారనుంది. ఇదిలా ఉంటే పలు మెట్రో స్టేషన్ల పరిసరాలు అధ్వానంగా ఉంటాయని, మూత్ర విసర్జన చేసే వీలు కూడా లేకుండా ఉంటాయని మలక్‌పేట నుంచి ఐటీ కారిడార్‌కు ప్రయాణించే ఓ ప్రయాణికుడు వివరించారు. మరుగుదొడ్డిని తలపిస్తూ, చెత్తచెదారం నిండిన లక్డీకాపూల్ మెట్రో స్టేషన్‌ను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ధరల సంగతి పక్కనపెడితే.. ముందు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలంటూ గట్టిగా వ్యాఖ్యానించారు.
కనీసం రాయితీలు, ప్రోత్సాహకాలతో సామాన్యుడిని ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. నిజానికి మెట్రో సంస్థకు ఉన్న కమర్షియల్ స్పేస్‌ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తే.. ఇంతకంటే తక్కువ ధరకే మెట్రో ప్రయాణం అందుబాటులోకి వస్తోంది. కానీ ఆ సంస్థకు ఉన్న కమర్షియల్ స్పేస్‌లో 20-25శాతం మాత్రమే వినియోగంలో ఉంది. దీంతోనే నష్టాలను భర్తీ చేసుకునేందుకు మెట్రో చార్జీలను పెంచేసింది.