నాంపల్లి క్రిమినల్ కోర్టులు, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ) : నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో ప్రధాన నిందితుడు రాగుల సాయికి మరణశిక్ష విధించేందుకు తెలంగాణ హైకోర్టు ద్వారా సెక్షన్ 366 సీఆర్పీసీ కింద అనుమతి తీసుకున్న నాంపల్లి రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జీ వినోద్‌కుమార్ శిక్షను ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మరణశిక్ష విధించేందుకు హైకోర్టును ఆశ్రయించగా అమలుకు వీలుకల్పించడంతో జిల్లా కోర్టు తీర్పును ప్రకటించడం ఆలస్యమైంది. ఈ కేసులో ఉన్న రెండో ముద్దాయి ఏ.రాహుల్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించింది.
నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద నివసిస్తున్న ఆర్తి, రాగులసాయి భార్యాభర్తలు.. ఇద్దరి మధ్య గొడవల కారణంగా ఆర్తి స్నేహితుడు నాగరాజును పెండ్లి చేసుకుంది. దీంతో ఆర్తిపై కక్ష పెంచుకున్న సాయి కడతేర్చేందుకు స్నేహితుడితో కలిసి పథకం ప్రకారం.. పెట్రోల్ పోసి నిప్పంటించారు. కడుపులో ఉన్న 8నెలల బిడ్డతో ఆర్తి, నాగరాజు, కుమారుడు విష్ణులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాధారాల్ని సేకరించిన తర్వాత పోలీసులు కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన అనంతరం జిల్లా కోర్టు.. నిందితులు నేరం చేసినట్టు రుజువుకావడంతో మరణశిక్షతో పాటు యావజ్జీవ కారాగార శిక్షలను ఖరారు చేసింది. నిందితులిద్దరూ 30 రోజుల్లోపు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి అప్పీల్ చేసుకునేందుకు ఉత్తర్వుల పత్రాన్ని హైదరాబాద్ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు పంపుతున్నట్టు కోర్టు పేర్కొంది. తెలంగాణ హైకోర్టు న్యాయసేవాధికార సంస్థ తరఫున ఉచిత న్యాయసేవల కోసం ఇద్దరు నిందితులకు వెసులుబాటు కల్పించింది. హైకోర్టు తీర్పు ప్రకారం మరణశిక్ష అమలుకు చర్యలు తీసుకోనుంది.