సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): అమ్మాయి పేరుతో వచ్చిన ఒక మెసేజ్‌కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. న్యూడ్ వీడియో కాల్ బారిన పడి బ్లాక్ మెయిలింగ్తో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సెల్‌ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయడంతో అమ్మాయి మాట్లాడింది. మీరు చాటింగ్‌లోకి రండి.. అంటూ.. ఆ యువతి చెప్పడంతో వాట్సాప్ చాటింగ్‌లోకి వెళ్లారు. కొద్దిసేపు చాటింగ్ చేసిన తర్వాత నగ్నంగా వీడియో కాల్ చేసింది.
ఆ తర్వాత బాధితుడిని కూడా నగ్నంగా వీడియో కాల్ చేయాలని సూచించడంతో అలాగే చేశాడు. ఆ తర్వాత.. నీ వీడియో అంతా రికార్డు అయ్యింది.. దానిని సోషల్ మీడియాలో పెడుతామంటూ బెదిరింపులకు దిగారు. భయపడిన బాధితుడు కొంత డబ్బు పంపించాడు. ఆ తర్వాత మేం సైబర్‌క్రైమ్ పోలీసులం.. ఒక యువతిని వేధించినట్లు మాకు ఫిర్యాదు అందింది.. ఆ అమ్మాయితో మాట్లాడుకొని రాజీ కుదుర్చుకోమంటూ మరో కాల్ వచ్చింది. దీంతో మరికొంత డబ్బును వారు సూచించిన ఖాతాలో డిపాజిట్ చేశాడు. అప్పటికే రూ.5 లక్షలు డిపాజిట్ చేసిన బాధితుడికి, బెదిరింపులు తగ్గలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.