హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగానికి ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ నగర పౌరుల్లో మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ‘ది మెంటల్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్-2024’ వెల్లడించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెపియన్ ల్యాబ్స్ ఈ కథనాన్ని ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం.. మానసిక ఆరోగ్యంలో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ముఖ్యంగా హైదరాబాద్ యువతలో మానసిక ఆరోగ్య సంక్షోభం ఆందోళనకర స్థితిలో ఉన్నట్టు ఆ అధ్యయనం పేర్కొంది.
మానసిక ఆరోగ్య సూచిక (మెంటల్ హెల్త్ కోషెంట్)లో హైదరాబాద్ కేవలం 58.3 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇది సగటు స్కోరు 63 కంటే తక్కువగా ఉన్నట్టు పేర్కొంది. ఈ జాబితాలో చివరి నుంచి రెండో స్థానంలో ఢిల్లీ 54.4 పాయింట్లతో నిలిచింది. 18 నుంచి 55 ఏండ్లు పైబడిన 75వేల మందిపై నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ రిపోర్టును తయారు చేసినట్టు సంస్థ వెల్లడించింది. బాధల్లోనున్న వారిని, పురోగతి సాధిస్తున్నవారికి మధ్య మెంటల్ హెల్త్ కోషెంట్ను వర్గీకరించారు. కాగా ‘స్థిరమైన’, ‘అదుపుచేయగల’ స్థితిలోని వారికన్నా హైదరాబాదీల సగటు దారుణంగా పడిపోతున్నట్టు ఆ నివేదిక ఆందోళన వ్యక్తంచేసింది.
స్మార్ట్ఫోన్ వినియోగమే ప్రధాన కారణం..
హైదరాబాద్లో నివసించే 32 శాతం మందిలో భావోద్వేగ సంబంధాలు సరిగా లేవని, అధిక ఒత్తిడికి గురవుతూ మానసిక పనితీరులో బలహీనంగా ఉన్నారని ఆ నివేదిక వివరించింది. ఈ ప్రభావం యువత, వయోజనులలో అధికంగా ఉన్నట్టు సెపియన్ ల్యాబ్స్ డైరెక్టర్ శైలెంద్ర స్వామినాథన్ పేర్కొన్నారు.
యువతలో మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడానికి అనేక కారణాలున్నట్టు తమ అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. సామాజిక సంబంధాలు లేకపోవడం, స్మార్ట్ఫోన్ అధికంగా వినియోగించడం వీటి లో ప్రధానమైనవని తెలిపారు. స్మార్ట్ఫోన్ల అధిక వినియోగం వల్ల చిన్న వయస్సులోనే విచారం, ఆందోళన, దూ కుడు వంటి సమస్యలకు గురవుతున్నారని పేర్కొన్నారు. వీటికి తోడు స్మార్ట్ఫోన్లను ఎక్కువగా చూడటం వల్ల నిద్రలేమి, ఆహారపు అలవాట్లలో మార్పు మొత్తంగా ఆరోగ్యం పాడవుతున్నట్టు తెలిపారు.
ఇక ఆహార పదార్థాల్లో ఉండే పురుగుమందులు, మైక్రోప్లాస్టిక్స్ కూడా మెదడు అభివృద్ధిని దెబ్బతీస్తున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ప్రభావం పిల్లల్లో అధికంగా ఉన్నట్టు తెలిపింది. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్(యూపీఎఫ్) క్రమంగా తీసుకుంటున్న వారిలో ఈ ప్రభావం ఎక్కవగా ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్లో మానసిక ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తున్నదని, వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలని ఆ అధ్యయనం సూచించింది.