సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక శైలితో ఆకట్టుకునే నిర్మాణాలే కాదు, దేశంలో వైవిధ్యమైన రాతి చిత్రాలను కలిగి ఉన్న ఒకే ఒక్క నగరం హైదరాబాద్ అని పలువురు చరిత్రకారులు పేర్కొంటున్నారు. మన నగరం చుట్టూ భూభాగంలో నెలకొని ఉన్న శిలలకు 2.5 బిలియన్ సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నదని తెలియజేస్తున్నారు. నగరం భౌగోళిక చరిత్ర హిమాలయాల కంటే పురాతనమైనదని, ఇక్కడి రాతి నిర్మాణాలు సహజ వారసత్వంలో భాగమయ్యాయని గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో అనేక ప్రాంతాలు వారసత్వ సంపదగా గుర్తించాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన అర్హత కూడా వాటికి ఉందని వారసత్వ కట్టడాలు, ప్రాంతాలను, రాతిశిలల పరిరక్షణ కోసం పనిచేసే వారు వెల్లడిస్తున్నారు.
నీటి నిల్వకు కేంద్రంగా రాతికొండలు..
రక్షిత భౌగోళిక ప్రదేశాల్లో భాగంగా 2009లో 25 రాతి నిర్మాణాలను జాబితాగా రూపొందించారు. సూక్ష్మ వృక్షజాలంతోపాటు జంతుజాలాన్ని కాపాడగలిగాయని, అవి తమలో తాము ఒక పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో కీలకంగా మారాయని పేర్కొన్నారు. అంతేకాదు హైదరాబాద్ నగరంలోని కొండ ప్రాంతాలు వర్షపు నీటి కంటైనర్లుగా వనరులను ఉత్పత్తి చేసే సాధనాలుగా పనిచేస్తాయని చెప్పారు.
భూగర్భజల వనరులను పునరుత్పత్తి చేయడంలో సాయపడతాయని, దుర్గం చెరువుతో సహా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని అనేక చెరువులు (సరస్సులు) నగరం భౌగోళిక నిర్మాణాల ద్వారా ఏర్పడినవేనని పేర్కొన్నారు. నగరంలోని శిలలు ఎకువగా బూడిద రంగుతోపాటు సహజ రంగులు కలిగి ఉంటాయని, ఇలాంటి ప్రత్యేకతలు హైదరాబాద్‌కు ప్రపంచ వారసత్వ నగర హోదాను పొందడంలో సహాయపడతాయని అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, రాతి (శిలలు) నిర్మాణాలు వారసత్వ ప్రదేశం ఎంపికకు అర్హత సాధించాయని ప్రముఖ చరిత్రకారుడు ఎంఎన్ శ్రీనివాసన్ అన్నారు. భవిష్యత్తులో ఈ శిలలను సంరక్షిస్తే వారసత్వ హోదాకు సహాయపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
సంరక్షించాలి, పరిరక్షించాలి
మధ్యయుగం నాటి చారిత్రక కుతుబ్‌షాహీ టూంబ్స్‌తో పాటు గొల్కొడ, చార్మినార్ లాంటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ హోదా దక్కాల్సిన అవసరం ఉంది. కానీ వాటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇవి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కట్టడాలు, కోటలు, సుప్రసిద్ధ బౌద్ధ ప్రదేశాలు, రాతిశిలలు అనేకం ఉన్నాయి. సూర్యాపేట జిల్లా ఫణిగిరి, సంగారెడ్డి జిల్లా కొండాపూర్, జగిత్యాల పరిధిలోని కోటిలింగాల, జియోలాజికల్ హెరిటేజ్ సైట్లు భువనగిరి కోట, జయశంకర్ భూపాలపల్లిలోని పాండవుల గుట్ట, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న రాక్ సైట్లు, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో డైనోసార్ శిలాజాలు దొరికే సైట్ లాంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నిటినీ సంరక్షించి, పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది.
– ఎంఎన్ శ్రీనివాసన్, చరిత్రకారుడు