సిటీబ్యూరో, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని, సమర్థవంతమైన మానవ వనరులు, ఆవిష్కరణలకు వేదికగా ఉందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ప్రశంసించారు. మంగళవారం సీఎస్ఐఆర్ ల్యాబోరేటరీల ఆధ్వర్యంలో హబ్సిగూడలోని ఐఐసీటీలో ఏర్పాటు చేసిన స్టార్టప్ కాంక్లేవ్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా నేపథ్యంలో దేశంలో పారిశ్రామిక విప్లవానికి బీజం పడిందన్నారు.
2014లో 50 స్టార్టప్‌లు ఉంటే, ప్రస్తుతం 10వేలకు పైగా స్టార్టప్‌లు, అందులో 3వేల మందికిపైగా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలే ఉన్నారని కొనియాడారు. సదస్సులో భాగంగా 50కిపైగా స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, ఐఐసీటీ డైరెక్టర్ డా. శ్రీనివాస్ రెడ్డి, ఎన్జీఆర్ఐ డైరెక్టర్ ప్రకాష్ కుమార్, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.