శేరిలింగంపల్లి, మే 4: ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ (IIA) తొలి సీజన్ జూన్ 28న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు రవి ప్రకాష్ , బాలీవుడ్ నటి నిఖితా రావల్, దర్శకులు ప్రదీప్ మదల్లి, రాకీ సింగ్, నటుడు రేవంత్ లెవాకాతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ లతీఫ్, చైర్మన్ ఆదిత్య ఖురానాలు కలిసి IIA టాలీవుడ్ సీజన్ 1 పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నటుడు రవి ప్రకాష్ మాట్లాడుతూ.. రివార్డులతో పాటు కళాకారులకు అవార్డులు కూడా ఎంతో ముఖ్యమని, మరింత ప్రోత్సాహాన్ని గుర్తింపు నిస్తాయని అన్నారు. తెలుగు సినిమా రంగంలో కళాకారులు, టెక్నిషియన్లకు ఐఐఏ టాలీవుడ్ అవార్ట్స్ నైట్ నిర్వహించడమని అభినందనీయమని కొనియాడారు. మొహమ్మద్ లతీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక రంగం సహకారంతో ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ టాలీవుడ్ మొదటి సీజన్ నగరంలో నిర్వహిస్తున్నామని అన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కళాకారులతో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తున్న వారిని గౌరవించడం ఈ అవార్డుల లక్ష్యమని చెప్పారు. 2014లో బాలీవుడ్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్స్ IIA గత సంవత్సరం ప్రాంతీయ సినిమాల్లోకి అడుగుపెట్టిందని ఈ సంవత్సరం టాలీవుడ్లో తన ప్రారంభ సీజన్‌ను పరిచయం చేయడం మరో మైలురాయిని సూచిస్తుందని మొహమ్మద్ లతీఫ్ చెప్పారు.