సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : హైడ్రా తీరును హైకోర్టు తప్పుబట్టింది. గతంలో ఎన్నోమార్లు మందలించినా తన తీరు మార్చుకోకపోగా ఇంకా దూకుడు ప్రదర్శిస్తూ మూసపద్ధతిలో వ్యవహరిస్తున్నది. శని, ఆదివారాల్లో కూల్చివేతలపై హైకోర్టు ఎంతగా సీరియస్ అయినా హైడ్రా మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉన్నది. తాజాగా మియాపూర్‌లో ఐదంతస్తుల భవనం కూల్చడం చర్చనీయాంశమైంది. ఇటీవల బతుకమ్మకుంట విషయంలో పెద్ద ఎత్తున చెరువును పునరుద్ధరించామంటూ ప్రచారం చేసుకున్న హైడ్రాకు కోర్టు మొట్టికాయలు వేసింది.
బతుకమ్మకుంటపై స్టేటస్ కో ఇచ్చినా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై సీరియస్ అయ్యింది. ఈ విషయంలో ఈ నెల 27న కోర్టుకు స్వయంగా హాజరు కావాలని, ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని, కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలంటూ చీవాట్లు పెట్టింది.
కోర్టు వివాదంలో ఉన్న స్థలంలో యథాతథ స్థితిని కొనసాగించాలని స్థలంలో ఎలాంటి మార్పులు చేయరాదని జూన్ 12న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినట్టుగా బతుకమ్మకుంట రూపురేఖలు మార్చినట్లుగా తేలడంతో పాటు అక్టోబర్ 5న నెలకొల్పిన శిలాఫలకం సాక్ష్యంగా ఉందని దీనిపై ఏం సమాధానం చెబుతారంటూ కోర్టు ప్రశ్నించింది. స్టేటస్కోలు కూడా పట్టించుకోకుండా చాలాచోట్ల హైడ్రా చేస్తున్న కూల్చివేతలు వివాదాన్ని మరింత జఠిలం చేస్తున్నాయన్న భావన నగర ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సున్నంచెరువు వద్ద కూడా ఇదే తరహాలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ సియేట్కాలనీ పట్టా భూముల్లో తవ్వకాలు చేపట్టారంటూ బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా హైడ్రా తీరులో ఎలాంటి మార్పు లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రతిసారీ శని, ఆదివారాల్లో కూల్చివేతలు ఎందుకు చేపడ్తారంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధులకు రంగనాథ్ న్యాయవ్యవస్థకు అనుకూలంగానే వారి తీర్పులను అనుసరించే పోతున్నామని చెబుతారు. అయితే వారాంతపు కూల్చివేతలపై గతంలో హైకోర్టు చాలాసార్లు హైడ్రా కమిషనర్‌ను తీవ్రంగా మందలించింది. వీకెండ్లో కూల్చివేతలు చేపట్టరాదని తీర్పులు స్పష్టంగా ఉన్నా అధికారులు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించింది. సెలవు రోజుల్లో కూల్చివేతలు చేపట్టరాదనే తీర్పు కాపీలను రంగనాథ్‌కు ఇచ్చామని, అవి చదువుకోవాలంటూ గతంలోనే సూచించింది.
అయినా రంగనాథ్ తీరు మారలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతీ శని, ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టే సమయం లో ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండకుండా పక్కా ప్లాన్‌తో హైడ్రా కూల్చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శనివారం మియాపూర్‌లో ఐదంతస్తుల అపార్ట్మెంట్ కూల్చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ముందుజాగ్రత్తగా పోలీసులను మోహరించి తాము అనుకున్నట్టు పని పూర్తిచేశారు.