Hyderabad Gay Couple | సుప్రియో చక్రవర్తి, అభయ్ డాంగ్.. ఇద్దరూ భర్తభర్తలు. అంటే అర్థం కాలేదా.. ఇద్దరూ ఒకరిని మరొకరు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పురుషులే కానీ.. గే కపుల్స్. ఇటీవల హైదరాబాద్‌లో అంగరంగవైభవంగా… తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వీళ్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలోనే తొలి గే మ్యారేజ్‌గా వాళ్ల పెళ్లి రికార్డుకెక్కింది.
అయితే.. అంతకుముందే తాము పెళ్లి చేసుకోబోతున్నామని సోషల్ మీడియా వేదికగా సుప్రియో, అభయ్ ప్రకటించారు. కాకపోతే ఇద్దరి మధ్య అసలు ప్రేమ ఎలా చిగురించింది. ఇద్దరికీ పరిచయం ఎలా ఏర్పడింది. ఇద్దరి మనసులు ఎలా కలిశాయి.. అనే విషయాలు చాలామందికి తెలియదు.
తమ ఫస్ట్ డేట్ గురించి.. తమ ఫస్ట్ లవ్ గురించి..ఇద్దరికి జరిగిన తొలి పరిచయం గురించి ఈ గే కపుల్స్.. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అదే స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టా పేజీలో షేర్ చేసింది. ఆ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“అభయ్‌తో జరిగిన నా ఫస్ట్ డేట్ 7 గంటల పాటు జరిగింది. అది కాఫీ డేట్. ఆ తర్వాత సెలూన్లో ముగిసింది. ఆ తర్వాత అలా ఎన్నోసార్లు కలుసుకున్నాం. అప్పుడే అభయ్‌కి ఫ్లాట్ అయిపోయా. అతడికి పడిపోయా. అతడంటే నాకు పిచ్చి ప్రేమ. కానీ.. మా మధ్య కొన్ని వ్యత్యాసాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే.. అభయ్ ఇంట్రోవర్ట్. పెద్దగా మాట్లాడడు. నేనేమో.. గలగలా మాట్లాడేస్తాను. ఏది లోపల దాచుకోను. కాకపోతే.. మా ఇద్దరి గమ్యం మాత్రం ఒక్కటే. ఇద్దరం ఫ్యామిలీకి చాలా గౌరవం ఇస్తాం. ఆ తర్వాత ఇద్దరి మనసులు కలిశాయి. ఇద్దరం ప్రేమించుకోవడం స్టార్ట్ చేశాం. మా ప్రేమ గురించి.. మా రిలేషన్షిప్ గురించి ముందు అభయ్ తన తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు వెంటనే మమ్మల్ని, మా ప్రేమను ఒప్పుకున్నారు. ఆ తర్వాత నా తల్లిదండ్రులకు మా విషయం చెప్పాను. వాళ్లకు ముందు ఏం అర్థం కాలేదు. నేను గే అని చెప్పాను. నాకు అభయ్ అంటే ఇష్టం అని మా అమ్మకు డైరెక్ట్‌గా చెప్పేశాను. ముందు కాస్త అడ్డు చెప్పినా.. తర్వాత తను ఒప్పుకుంది. తన అంగీకారంతోనే నేను ముందడుగు వేశాను. ఆ తర్వాత నా తండ్రికి, నా సోదరికి ఈ విషయం చెప్పాను. నువ్వు హ్యాపీగా ఉంటే అదే చాలు మాకు అన్నారు మా వాళ్లు. అప్పటి నుంచి అభయ్‌ని నా భర్తగా ఊహించుకోవడం ప్రారంభించాను. కాకపోతే.. గే మ్యారేజ్‌కు ఇండియాలో చట్టబద్ధత లేదు. అదే మమ్మల్ని చాలాసార్లు బాధించింది.
ఏప్రిల్ 2021లో మా ఇద్దరికీ కరోనా వచ్చింది. నాకు హైఫీవర్ వచ్చింది. అభయ్‌కి స్వల్ప లక్షణాలే ఉన్నాయి. అప్పుడు అభయే నన్ను దగ్గరుండి చూసుకున్నాడు. నాకు ఏ లోటూ రానివ్వలేదు. అతడి వల్లే నేను త్వరగా కోలుకున్నాను. అప్పుడే నాకు అనిపించింది. అభయ్‌ని తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోకూడదని. వెంటనే ప్రపోజ్ చేశాను. పెళ్లి చేసుకుందాం అన్నాను. దీంతో అభయ్ కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ.. ఎలా.. అనే ప్రశ్న మాలో మొదలైంది. చట్టబద్ధంగా మేము పెళ్లి చేసుకోలేము. కానీ.. మా ఫ్యామిలీ మద్దతు ఉంది కదా. అందుకే.. మా ఫ్యామిలీ సహకారంలో పెళ్లిని ఘనంగా జరుపుకున్నాం. మా పెళ్లికి ఏ లోటూ లేదు. మెహందీ నుంచి సంగీత్, హల్దీ అన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. మా పెళ్లి రోజున ఇద్దరం మా పాత వాచ్‌లను ధరించాం. ఇద్దరం ప్రామీస్ చేసుకున్నాం. ఒకరిని విడిచి ఇంకొకరం ఎప్పుడూ ఉండకూడదని. జీవితాంతం కలిసి ఉంటామని. ఇప్పుడు ఇద్దరం చాలా హ్యాపీగా ఉంటున్నాం. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలను.. అభయ్ నా భర్త అని”.. అంటూ సుప్రియో చక్రవర్తి ముగించాడు.