సైదాబాద్, మే 7 : సైదాబాద్ ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో అధికారులు ఇష్టానుసారంగా పనులను కొనసాగిస్తుండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. విస్తరణ సమయంలో డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థకు అంతరాయం కలుగుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వాటిని బాగు చేయటంలో నిర్లక్ష్యం చేయకుండా పనులు వేగిరం చేయాలంటున్నారు. సంబంధిత అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులకు సమన్వయంతో పనిచేసి పరిష్కరించాలని విన్నవిస్తున్నారు. తామే స్వంతంగా పనులు చేసుకునే పరిస్థితి నెలకొన్నదంటున్నారు. షాపు, ఇండ్ల ఎదుట మట్టి కుప్పలు ఉండడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సైదాబాద్ ప్రధాన రహదారిపై..
సైదాబాద్ ప్రధాన రహదారిపై పనులతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు, షాపుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఎస్వీ కలర్ ల్యాబ్, ఎస్బీఐ వద్ద విస్తరణ పనులు అస్తవ్యస్తంగా చేస్తున్నారని అంటున్నారు. డ్రైనేజీ, తాగునీటి పైపులైన్లు పగిలిపోవటంతో మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తాగునీరు లేకపోవటంతో వేసవిలో బాధలు పడుతున్నామని బాధితులు అంటున్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం ..
ప్రధానరోడ్డు విస్తరణలో భాగంగా తాగునీటి, డ్రైనేజీ వ్యవస్థలకు ఇబ్బందులు కలుగుతున్న మాట వాస్తవమే. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా తొలగించటానికి చర్యలు తీసుకుంటున్నాం. ధ్వంసమైన డ్రైనేజీ, తాగునీటి పైపు వ్యవస్థలను బాగు చేయటానికి చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే పనులను మొదలుపెట్టి సకాలంలో పూర్తిచేస్తాం. పనుల మూలంగా స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– వైట్ల అశోక్ జీఎం, జలమండలి డివిజన్ – 2