కవాడిగూడ, మే 3: సమ సమాజ నిర్మాణానికి బసవేశ్వరుడు ఆనాడే బాటలు వేశాడని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సీఎం కేసీఆర్ వీరశైవ లింగాయత్ బలిజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వారు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం, లింగ సమాజ్ సంయుక్త ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహం వద్ద మహాత్మా బసవేశ్వర 889 జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ బీబీ పాటిల్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెన్న ఈశ్వరప్ప, తెలంగాణ అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు, తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడు పులి గారి గోవర్ధన్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి సంఘప్ప, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కరులు హాజరై బసవేశ్వర విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లింగాయత్‌ల భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఐదెకరాల స్థలంతో పాటు రూ.10 కోట్లు కేటాయించిందని అన్నారు. కార్యక్రమంలో లింగ సమాజ్ అధ్యక్షుడు మాడపు వీరమల్లేశ్, వీరశైవ లింగాయత్, లింగబలిజ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శెట్టి కుమార్, కోశాధికారి దినేశ్ పాటిల్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు కల్లపల్లి రాంబాబు రాఘు, మధు, రాకేశ్, గిరిబాబులతో పాటు సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బసవేశ్వర గొప్ప సంఘ సంస్కర్త: ఏకే మిశ్రా
జూబ్లీహిల్స్: మహాత్మా బసవేశ్వర గొప్ప సంఘ సం స్కర్త అని, 12వ శతాబ్దంలోనే సామాజిక, ఆర్థిక సమానత్వాల కోసం పోరాడాడని యూసుఫ్‌గూడ ప్రథమ పటా లం కమాండెంట్ ఏకే మిశ్రా కొనియాడారు. టీఎస్ఎస్పీ ఫస్ట్ పోలీస్ బెటాలియన్‌లో విశ్వగురు బస్వేశ్వర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు జె.రాందాస్, కేపీ సత్యనారాయణ, బి.జవహర్లాల్, ఆర్ఐలు ఎస్.సురేష్, టి.ధర్మారావు, టి.సాంబయ్య, వై.రవీందర్, ఎండి.జాఫర్, ఆర్ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
డీజీపీ కార్యాలయంలో ఘనంగా జయంతి
బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను డీజీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పోలీసు అధికారులు బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి సీఎస్ఓ యోగేశ్వర్రావు, డీఎస్పీ వేణుగోపాల్ ఇతర పోలీస్ అధికారులు పుష్పాంజలి ఘటించారు.