సిటీబ్యూరో, మే 03(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నాలాల పూడిక తీత పనులను ఈ నెలాఖరు నాటికల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా పనుల్లో వేగం పెంచారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా సుమారు రూ.56 కోట్లతో 371 చోట్ల పూడిక తీత పనులను శ్రీకారం చుట్టారు. ఐతే ఖైరతాబాద్‌లో రెండు, సికింద్రాబాద్‌లో ఒక చోట టెండర్ దశలో ఉండగా, మిగిలిన చోట్ల నాలాల పూడిక తీత పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు 6.59 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నాలా పూడిక తీత పనులు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేసి రాబోయే వర్షాకాలంలో వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కాగా, నాలాలలో పూడిక తొలగింపు పనులను ఆరుగురు ఎస్ఈలు ఆయా జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఏ రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయి? ఏ మేరకు జరిగాయనే అంశాలను పర్యవేక్షిస్తూ పనులను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు.