చార్మినార్, మే 3: నగరంలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ. భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు. రంజాన్ పురస్కరించుకొని ముస్లింలు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారు జామునుంచే ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలకు మసీదులకు తరలివెళ్లారు. పాతబస్తీలోని మక్కా మసీదుతోపాటు మీరాలం ఈద్గాలకు పెద్దలు, చిన్నారులు కలిసి వచ్చి ప్రార్థనలు నిర్వహించారు. మరోపక్క మసీదుల వద్దకు వచ్చిన పేదలకు తోచిన ఉపకారం చేశారు. మీరాలం ఈద్గాలో మక్కా మసీద్ కతీబ్ రిజ్వాన్ ఖురేషి ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు.
పూర్వీకులను స్మరించుకున్న ముస్లింలు..
ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలు ముగించుకున్న ముస్లింలు వారి పూర్వీకుల సమాధుల వద్ద శ్రద్ధాంజలి ఘటించి ప్రార్థనలు చేశారు. అనంతరం బంధుమిత్రులతో కలిసి స్వీట్లు, షీర్ ఖుర్మాను పంచుకున్నారు.
రంజాన్ శుభాకాంక్షలు: సీపీ సీవీ ఆనంద్
నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక పోలీసు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సీపీ సీవీ ఆనంద్‌తోపాటు పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు చాక్లెట్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం పోలీసు సిబ్బంది కృషి చేశారని తెలిపారు. పోలీసులకు సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
తెలంగాణలో అన్ని వర్గాలకు సముచిత స్థానం: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ప్రసంగించారు. శాంతి, సుస్థిర పాలనే అభివృద్ధికి మూలమన్నారు. దేశ వ్యాప్తంగా నేడు ఆధిపత్య ధోరణి పెరుగుతున్నదని, వాటిని అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పాటుపడుతూ అన్ని వర్గాల వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నదని అన్నారు.