సిటీబ్యూరో, మే 3(నమస్తే తెలంగాణ): నగర శివారు విజయవాడ జాతీయర హదారి పక్కన చెట్ల పొదల్లో కుళ్లిన జంట మృతదేహాలు కలకలం రేపాయి. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతిని రాళ్లతో మోది హతమార్చిన దారుణం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద మంగళవారం వెలుగులోకి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన డీసీపీ మూడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
నగరంలోని వారాసిగూడకు చెందిన ఎడ్ల యశ్వంత్(22) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మెట్టుగూడకు చెందిన ఓ వివాహిత(28)కు భర్త, ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఇరువురు ఆదివారం ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే బుధవారం కొత్తగూడెం బ్రిడ్జి వద్ద తీవ్రమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఈ మృతదేహాలను గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుశోత్తమ్ రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్స్పెక్టర్ స్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. డీసీపీ సంప్రీత్ సింగ్ దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తూ.. దర్యాప్తును ముమ్మరం చేశారు.
గతంలో కూడా వచ్చారేమో..?
వారాసిగూడకు చెందిన యశ్వంత్, మెట్టుగూడకు చెందిన వివాహితకు గత కొన్నాళ్ల కిందట పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఇద్దరు గత కొన్ని రోజుల నుంచి సన్నిహితంగా తిరుగుతున్నారు. సికింద్రాబాద్‌లో ఉండే వీరికి శివారులో ఉండే ఈ ప్రాంతం ఎలా తెలిసిందనేది ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. అయితే హత్య జరిగిన చోటుకు గతంలో కూడా వీరు వచ్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ కావడంతో ఈ నిర్జనప్రదేశం తెలిసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఏకాంతంగా, సన్నిహితంగా ఉన్న సమయంలో..?
ఆదివారం సాయంత్రమే ఈ జంట ఇక్కడికి వచ్చి ఉంటుందని, నిందితులు వారి ప్రయాణాన్ని ముందే పసిగట్టి ఫాలో అయినట్లు తెలుస్తున్నది. ఈ నిర్జన ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇద్దరు ఏకాంతంగా, సన్నిహితంగా ఉన్న సమయంలో దుండగులు దాడి చేసి హతమార్చారని ప్రాథమికంగా తేలింది. వివాహిత ముఖం, తలపై బండరాయితో కొట్టి హత్య చేయగా, యశ్వంత్‌పై స్క్రూ డ్రైవర్ లేదా పదునైనా ఇనుప రాడ్‌తో దాడి చేసి హతమార్చి ఉండవచ్చని క్లూస్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా యశ్వంత్ మర్మాంగం ప్రదేశంలో కూడా విచక్షణారహితంగా పొడిచినట్లు గుర్తించారు. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత వారి మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అంతకుముందు హత్యకు పాల్పడిన నిందితులు వీరిని వెంబడిస్తూ సెల్ఫోన్లో వీడియో ఏమైనా తీశారా.. అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.
బ్యాగులో చెప్పుల బిల్లు..
సంఘటన స్థలంలో హోండా యాక్టివా బైక్‌ను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా మృతుడు యశ్వంత్గా నిర్ధారించారు. అక్కడ దొరికిన హ్యాండ్ బ్యాగ్‌లో సెంట్రో చెప్పుల దుకాణానికి సంబంధించిన రశీదు ఉండగా అందులోని నంబర్‌కు ఫోన్‌చేసిన పోలీసులు ఇటీవల ఎవరైనా మహిళకు చెప్పులు ఇప్పించారా అని ఆరా తీశారు. తన స్నేహితుడు స్నేహితురాలికి చెప్పులు ఇప్పించాడని చెప్పడంతో నిర్ధారణ కోసం చెప్పులను ఫొటో తీసి వాట్సాప్‌లో పంపించగా.. గుర్తించి వివాహితగా తెలిపాడు. అయితే ఈ హత్యకు పాల్పడింది వివాహిత భర్తనా, వివాహిత తరఫు సమీప బంధువులా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.