– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) :హైదరాబాద్ విశ్వ నగర సిగలో మరో ఐటీ మణిహారం చేరనుంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల మాదిరిగానే ఐటీ దిగ్గజం గూగుల్ నగర వేదికగా తమ కార్యకలాపాలను విస్తృతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా నానక్‌రాంగూడలో 7.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న గూగుల్ క్యాంపస్ కార్యాలయ డిజైన్‌ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్‌కు కేంద్ర బిందువైన గూగుల్‌కు అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్‌కు హైదరాబాద్ మహా నగరం వేదికగా నిలవడం చారిత్రక విశేషం.
ఐటీ, ఐటీఈఎస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లోని అంతర్జాతీయ సంస్థలకు హైదరాబాద్ నగరం స్వర్గధామంలా మారింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ ఐటీ సంస్థలు ఇప్పటికే తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని నానక్‌రాంగూడలో అమెజాన్ 5 ఎకరాల విస్తీర్ణంలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ 3వేల నుంచి 5వేల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ తన రెండో డేటా సెంటర్‌ను కూడా నగరంలోనే ఏర్పాటు చేసుకుంది. దీంతో పాటు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా ఇండియన్ బిజినెస్ స్కూల్ సమీపంలో తన క్యాంపస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎనిమిది వేల మంది ఉద్యోగులతో ఏకంగా 53 ఎకరాల్లో మైక్రోసాఫ్ట్ క్యాంపస్ హైదరాబాద్‌లో కొనసాగుతుంది. ఆపిల్ సంస్థ కూడా నగర కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నప్పటికీ… ఇప్పటివరకు సొంత క్యాంపస్ అనేది లేదు. భవిష్యత్‌లో ఆ సంస్థ కూడా తన సొంత కార్యాలయ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఇవే కాకుండా కంట్రోస్ ఎస్ కూడా తన డేటా సెంటర్‌ను నగరంలోనే ఏర్పాటు చేసుకుంది. తాజాగా గూగుల్ తన రెండో అతి పెద్ద క్యాంపస్‌ను నానక్‌రాంగూడలో 33 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సుమారు రెండు సంవత్సరాల్లో ఈ క్యాంపస్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని అంచనా. ఇక్కడ ఏడు వేల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పని చేయనున్నారు.
యువతకు సువర్ణావకాశం…
ఐటీ దిగ్గజం నేరుగా నగర కేంద్రంగా తెలంగాణ యువతకు మంచి అవకాశాలను కల్పించనుంది. ప్రధానంగా గూగుల్ ఐదు అంశాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయనున్నందున వివిధ రంగాల వారికి ఎంతో మేలు జరగనుంది.
తాజాగా డిమాండ్ ఉన్న ఐటీ కోర్సులను అందిపుచ్చుకొని నైపుణ్యత సాధిస్తే యువతకు ఉద్యోగావకాశాలు పుష్కలం. అందుకే గూగుల్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడంలో భాగంగా యువతకు డిమాండ్ ఉన్న కోర్సుల్లో తెలంగాణ ప్రభుత్వం నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకుగాను సహాయ, సహకారాలు అందించనుంది. గూగుల్ కెరీర్ సర్టిఫికెట్ కోర్సులో భాగంగా ఉపకార వేతనాలు కూడా కల్పించనుంది. ఐటీ అనుబంధ, ఐటీ ఆటోమేషన్, యూఎక్స్ డిజైన్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ వంటి డిమాండ్ ఉన్న రంగాల్లో యువత ఉద్యోగావకాశాలను సాధించేందుకు కావాల్సిన నైపుణ్యతను సాధించేందుకు సహకారాన్ని అందించనుంది.
తెలంగాణ ఐటీ శాఖ ఏర్పాటు చేసిన వీ-హబ్‌తో కలిసి గూగుల్ రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు అవసరమైన నైపుణ్యం సాధించేందుకు సహకారాన్ని అందించనుంది. ప్రధానంగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో నైపుణ్యాన్ని సాధించి సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల ద్వారా వారు డిజిటల్ రంగంలో రాణించేందుకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ‘ఉమెన్ విల్’ కార్యక్రమం కింద మూల్యాంకనం, సూచనలు ద్వారా మహిళలకు సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కింద రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆంగ్ల మాధ్యమంతో పాటు వసతుల్లోనూ కార్పొరేట్‌కు ధీటుగా తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ సహకారంతో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించనుంది.
వ్యవసాయ రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వానికి గూగుల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి సహకరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా భూముల కమతాలకు సంబంధించి సర్వే నెంబర్లు, హద్దులు డిజిటటైజేషన్ చేసేందుకు గూగుల్ తన సహకారాన్ని అందించనుంది.
హైదరాబాద్‌లో రైల్వే, ఆర్టీసీ, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు అనేవి లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకునే చర్యల్లో గూగుల్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది.