-అబిడ్స్, ఏప్రిల్ 22: ఆయనది నిరుపేద వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచే మంచి విద్యావేత్త కావాలనే తపన. తాను నేర్చుకున్న విద్య అందరికీ పంచాలనేదే సంకల్పం..గ్రామీణ ప్రాంత విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలనేదే ఆశయం. తాను పడిన కష్టాలు ఎవరూ పడవద్దని.. పట్టుదలతో పీజీ పూర్తి చేసి..విద్యాసంస్థను నెలకొల్పారు. విద్యకుసుమాలు వికసించేలా విద్యార్థులకు అత్యుత్తమ విద్యనందిస్తూనే.. సేవాభావాన్ని చాటుకుంటూ..అందరి మన్నలు అందుకుంటున్నారు. ఆయనే విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ గౌరీసతీశ్. ఆయన స్థాపించిన విజ్ఞాన్ కళాశాలలు నేడు నాణ్యమైన బోధనకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కార్పొరేట్ స్థాయి విద్యనందిస్తుండటంతో ఏటా రాష్ట్ర, వర్సిటీ స్థాయి ర్యాంకులతో ‘విజ్ఞాన్’ విద్యార్థులు
సత్తాచాటుతున్నారు.
7 కిలోమీటర్లు నడిచి వెళ్లి..
విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ గౌరీసతీశ్ రంగారెడ్డి జిల్లా నక్కలపల్లి గ్రామానికి చెందిన వారు. గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు తప్పనిసరిగా ఏడున్నర కిలోమీటర్లు కాలి నడక తప్పేది కాదు. ఊరిలో పాఠశాల లేకపోవడంతో ఏడున్నర కిలోమీటర్లు నడిచి.. పక్క గ్రామానికి వెళ్లి పదో తరగతి వరకు విద్యనభ్యసించారు. అదే పట్టుదలతో ఏడున్నర కిలోమీటర్లు ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వచ్చి ఆర్టీసీ బస్సులో కాచిగూడకు వెళ్లి ఇంటర్ పూర్తి చేశారు. అనంతరం పీజీని పూర్తి చేసుకొని.. పేద విద్యార్థులను ఆదుకోవాలనే సంకల్పంతో నగర శివారు ప్రాంతాలైన శంషాబాద్, బండ్లగూడ, అత్తాపూర్‌లలో విద్యా సంస్థలను ఏర్పాటు చేసి ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్నారు. కళాశాలలను నిర్వహిస్తూనే..సామాజిక సేవా కార్యక్రమాలను కూడా చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అవస్థలు చూసి..
2001లో పీజీ పూర్తి చేసిన గౌరీసతీశ్ విద్యాదానం చేయాలనే సంకల్పంతో నగర శివారు ప్రాంతాల్లో విద్యాసంస్థను ఏర్పాటు చేసేందుకు సర్వే నిర్వహించారు. శంషాబాద్‌లో కళాశాల లేకపోవడం వల్ల పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు చదువుకునేందుకు నానా అవస్థలు పడుతూ.. పట్టణానికి వెళ్తున్న పరిస్థితిని గమనించారు. ఎలాగైనా శంషాబాద్ ప్రాంతంలో విద్యాసంస్థను నెలకొల్పాలని నిర్ణయించుకొని 2002-03 విద్యా సంవత్సరంలో శంషాబాద్‌లో మొట్టమొదట ఇంటర్మీడియట్ కళాశాలను ప్రారంభించారు. ఆ సంవత్సరం కేవలం 173 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో శంషాబాద్‌లో ఇంటర్‌తో పాటు డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టారు. అనంతరం
బండ్లగూడ, అత్తాపూర్‌లలో శాఖలను ఏర్పాటు చేసి ఇంటర్మీడియట్‌తో పాటు డిగ్రీ, పీజీ కోర్సులను కూడా ప్రవేశపెట్టడంతో ప్రస్తుతం ప్రతి విద్యా సంవత్సరం వేలాది మంది విద్యనభ్యసిస్తున్నారు. 21 ఏండ్లుగా అనేక మంది విద్యార్థులు ఈ కళాశాలల్లో విద్యనభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. కొందరు ప్రభుత్వ, కార్పొరేట్, సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలను సాధించారు. 173 మంది విద్యార్థులతో ప్రారంభమైన విజ్ఞాన్ విద్యాసంస్థల్లో ఇప్పటివరకు దాదాపు 30 వేల మంది విద్యను పూర్తి చేసుకున్నారు.
వర్సిటీ స్థాయి ర్యాంకులు
తొలుత నగర శివారు ప్రాంతాల్లో విద్యాసంస్థను నెలకొల్పాలని నిర్ణయించుకున్న గౌరీసతీశ్.. మొట్ట మొదటి విజ్ఞాన్ కళాశాలను శంషాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత బండ్లగూడ, అత్తాపూర్‌లలో శాఖలను ఏర్పాటు చేసి విద్యావ్యాప్తికి నాంది పలికారు. ఇంటర్‌తో పాటు డిగ్రీ, పీజీ కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించి వారు జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. మొదట అతి తక్కువ విద్యార్థులతో ప్రారంభమైన ‘విజ్ఞాన్’.. ప్రస్తుతం వేలాది మంది విద్యనభ్యసించే స్థాయికి ఎదిగింది. ఇందులోని ఇంటర్ విద్యార్థులు ఏటా రాష్ట్ర స్థాయి ర్యాంకులను సాధిస్తుండగా, డిగ్రీ, పీజీ విద్యార్థులు వర్సిటీ స్థాయి ర్యాంకులను పొంది… కళాశాల పేరు ప్రఖ్యాతలను పెంపొందిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరీసతీశ్ విద్యాసంస్థల యజమానుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. ఏ సమస్య వచ్చినా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి.. పరిష్కారానికి పాటుపడుతున్నారు.
జీవితంలో స్థిరపడేలా…
విజ్ఞాన్ విద్యాసంస్థల్లో చేరే ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు చైర్మన్ గౌరీ సతీశ్. ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులను తీర్చిదిద్దడమే కాకుండా వారికి సామాజిక సేవపై అవగాహన కల్పిస్తున్నారు. మూడు కళాశాలల్లో అత్యాధునిక లైబ్రరీ, వేలాది పుస్తకాలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం, విశాలమైన కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు ఏ లోటు రాకుండా అన్ని వసతులు కల్పిస్తున్నారు.
సామాజిక సేవా కార్యక్రమాలు..
విజ్ఞాన్ విద్యాసంస్థల్లో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఎన్ఎస్ఎస్, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణను ఏర్పాటు చేయడం, టాస్క్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతున్నారు. పెద్ద తూప్రా తండాలో కలరా వ్యాధి సోకడంతో ఆ తండాలో వారం రోజుల పాటు కళాశాల విద్యార్థులతో కలిసి గ్రామాన్ని పరిశుభ్రం చేసి జిల్లా పరిపాలనాధికారి మన్ననలు పొందారు. అదే విధంగా కరోనా సమయంలో నగరం, రంగారెడ్డి జిల్లాలో వేలాది కుటుంబాలకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు శానిటైర్లు, మాస్కులు, నిత్యావసర సరుకులను అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు గౌరీసతీశ్. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు సైతం మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఉచితంగా విద్యనందించి ఆదుకుంటున్నారు. అదే విధంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేసేందుకు సామాజిక బాధ్యతగా తీసుకుని తన కళాశాలల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు నిర్వహించారు.
కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్నాం..
చదువుకునేందుకు ఏడున్నర కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లే వాడిని. నాలాంటి పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండేందుకు విద్యాసంస్థలను నెలకొల్పి విద్యాదానం చేయాలని నిర్ణయించుకున్నా.. 2002లో మొదట శంషాబాద్ తరువాత బండ్లగూడ, అత్తాపూర్‌లలో కళాశాలలను ఏర్పాటు చేసి వాటి ద్వారా పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యాబోధన అందిస్తున్నాం. నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి తక్కువ ఫీజులతో బోధిస్తున్నాం. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మా కళాశాలలను తీర్చిదిద్దాం. ఇందులో విద్యనభ్యసించిన విద్యార్థులు తప్పనిసరిగా ఉద్యోగం సాధించేలా వివిధ ఎంఎన్సీ కంపెనీలతో క్యాంపస్ సెలక్షన్ నిర్వహిస్తున్నాం. మా కళాశాలలో ఇప్పటివరకు వేలాది మంది విద్యనభ్యసించి దేశ, విదేశాలలో స్థిరపడ్డారు. తల్లిదండ్రుల సహకారంతో కళాశాలల్లో మరింత మెరుగైన విద్యాబోధన అందించేందుకు కృషి చేస్తున్నాం.
– గౌరీసతీశ్, విజ్ఞాన్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్, రాష్ట్ర ప్రైవేట్ జూనియర్ కళాశాలల
మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు