శామీర్పేట, ఏప్రిల్ 15 : రైతును రాజు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నిజం చేస్తున్నాడు. మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండటంతో రైతులు గ్రామ గ్రామాన సంబురాలు చేసుకుంటున్నారు.
ఉమ్మడి శామీర్పేట మండలంలో శామీర్పేట, కేశవరం, లక్ష్మాపూర్, ఉద్దెమర్రి గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు యథావిధిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు వ్యవసాయశాఖ, సొసైటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. శామీర్పేట మండలంలోని 10 గ్రామాల్లో మొత్తం 2350 ఎకరాలు ఉండగా… యాసంగిలో 822 ఎకరాల్లో వరిసాగు చేశారు. మూడుచింతలపల్లిలో గత ఏడాది 2800 ఎకరాలు ఉండగా ఈ యాసంగిలో 1800 ఎకరాల్లో వరి పంట వేశారు. కాగా మొత్తం నాలుగు కేంద్రాల ద్వారా గత యాసంగిలో 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ యాసంగిలో 4500 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని అధికారులు, సొసైటీ పాలకవర్గం ఇప్పటికే స్పష్టం చేసింది.
ముందుచూపుతోనే..
యాసంగిలో వరి వేసిన రైతులు నష్టపోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించాడు. యాసంగిలో వరికి బదులుగా ఇతర పంటలు వేసుకోవాలని రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలతో అవగాహన కల్పించారు. రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడొద్దన్న ఆలోచనతో రైతులను నష్టాల్లో పడకుండా చేసిండు.
– కొంపల్లి వీరస్వామి, కేశవరం రైతు
నిజంగా కేసీఆరే దిక్కు..
తెలంగాణలోని రైతులకే కాదు దేశంలోని రైతులకు కూడా రాబోయే రోజుల్లో కేసీఆరే దిక్కు. యాసంగి వడ్లు కొనేందుకు కేంద్రం ముందునుంచే మొండి వైఖరి అవలంబిస్తున్నది. రైతుల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినా..కేంద్రం ఆలోచించలేదు. రైతులు నష్టపోవద్దని యాసంగి పంటను కొనేందుకు ముఖ్యమంత్రి స్వయంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చిండు. -గూడ సత్తిరెడ్డి, రైతు