జూబ్లీహిల్స్,ఏప్రిల్11: ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ఎర్లీబర్డ్ ఆఫర్ వరంలా మారింది. నగర పాలక సంస్థ ఏప్రిల్ 30 వరకు ఎర్లీబర్డ్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2022-23 ఆస్తిపన్నును ఈ నెలలోనే చెల్లించిన వారికి 5 శాతం తగ్గింపు ఇవ్వనున్నారు. యూసుఫ్‌గూడ సర్కిల్లో జీహెచ్ఎంసీ అధికారులు ఏప్రిల్ నెలలో రూ.10 కోట్లు లక్ష్యంగా ఆస్తిపన్ను వసూలు చేపడుతున్నారు. నగర పాలక సంస్థలోని సర్కిల్ కార్యాలయాలు అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోయేందుకు ఆస్తిపన్ను వ సూలును ముమ్మరం చేయనున్నారు. జీహెచ్ఎంసీ సర్కిళ్ల పరిధిలోని వార్డుల పురోభివృద్ధిలో ప్రాపర్టీ ట్యాక్స్ ప్రధాన భూమిక పోషించనుండటంతో ఈ నెల రోజుల వ్యవధిలో ఆస్తిపన్ను చెల్లించేవారికి ఎర్లీబర్డ్ ఆఫర్‌ను ప్రకటించారు. యూసుఫ్‌గూడ సర్కిల్లో ఇప్పటివరకు రూ.2 కోట్ల వసూలుకు చేరుకున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
ముందుగా ఆస్తిపన్ను చెల్లించి ఎర్లీబర్డ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సకాలంలో చెల్లిస్తే వడ్డీభారం తప్పుతుంది. ఆస్తిపన్నును చెల్లించడంతో పాటు పాత బకాయిలు కూడా చెల్లించి సహకరించాలి. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నాం.
-రమేశ్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్