సిటీబ్యూరో, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ ) : 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీ ఆశించిన స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. ఆరు జోన్ల పరిధిలో 13.50 లక్షల మంది యజమానులు రూ.1495.29 కోట్ల మేర ఆస్తి పన్ను చెల్లించారు. ఖైరతాబాద్ జోన్లో అత్యధికంగా రూ.408.46 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావడంతో ఆ జోన్ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శేరిలింగంపల్లి రూ. 294.54 కోట్లు, మూడో స్థానంలో కూకట్పల్లిలో రూ. 252.90 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలైంది. అత్యల్పంగా చార్మినార్ జోన్లో రూ.102.16 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో 12.30 లక్షల మంది రూ.1633.75 కోట్లు ఆస్తి పన్నును చెల్లించారు. కాగా, గడువులోపు ఆస్తిపన్ను చెల్లించని వారినుంచి ఇక మీదట అదనంగా రెండు శాతం వడ్డీతో పన్ను వసూలు చేయనున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రేటర్ అభివృద్ధి..
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1495.29 కోట్ల మేరకు ఆస్తి పన్ను వసూలు కావడం పట్ల నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. పన్నులు చెల్లించిన నగర ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే నగరాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. నగర ప్రజలు ఆస్తి పన్ను చెల్లించి తమ బాధ్యతను మరోసారి నిర్వర్తించారని ఆమె ప్రశంసించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ..
వసూలు చేయాలనుకున్న పన్ను రూ. 1850కోట్లు
వసూలైన పన్ను రూ. 1495.29 కోట్లు
లోటు రూ.354.71కోట్లు
ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సినబకాయిలు
రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుంచి జీహెచ్ఎంసీకి రావాల్సిన ఆస్తిపన్ను రూ.400కోట్లు
పాత సచివాలయం రూ. 100కోట్లు
ఆర్టీసీ రూ. 22 కోట్లు
జలమండలి రూ. 20కోట్లు
మెట్రో రైలు రూ. 23కోట్లు
పోలీస్ లైన్ రూ. 6కోట్లు
ఫీవర్ దవాఖాన రూ.6కోట్లు