ఎండలో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
పట్టించుకోని అధికారులు
కాచిగూడ,మార్చి 23: గోల్నాక డివిజన్ పరిధిల్లో ప్రధాన రహదారుల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ రోడ్డుపై నిలబడి ప్రయాణాలు కొనసాగిస్తున్నా రు.ఆర్టీసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఆరోపిస్తున్నా రు. గోల్నాక డివిజన్లోని ప్రధాన రహదారైన హర్రాస్‌పెంట, సుందర్‌నగర్ తదితర ప్రాంతాల్లో బస్టాప్‌ల్లో షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలోనే నిల్చొని నరకయాతన అనుభవిస్తున్నారు.
అసలే వేసవి, మిట్ట మధ్యాహ్నం బస్సుల రాక కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.వరంగల్ హైవే రహదారి మార్గమధ్యలో హర్రాస్‌పెంట, సుందర్‌నగర్‌లో బస్టాప్‌లో షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు కిలోమీటర్ మేరా నడుచుకుంటూ బస్టాప్‌లలో షెల్టర్లు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఎక్కాల్సిన పరిస్థితి నెలకొందని మహిళా ప్రయాణికులు ఆరోపించారు.
హర్రాస్ పెంట ప్రాంతంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని గతంలో సంబంధిత ఆర్టీసీ అధికారులకు విన్నవించినా ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గోల్నాక డివిజన్లోని ఆయా ప్రాంతంలోని బస్ షెల్టర్ల సౌకర్యం కల్పించి ప్రయాణికులను రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
బస్‌షెల్టర్ లేక ఇబ్బందులు పడుతున్నాం..
కోఠి నుంచి ఉప్పల్ వరకు వెళ్లే దారి మార్గ మధ్యలో హర్రాస్పెంటలో బస్‌స్టాప్ లేకపోవడంతో అనేక అవస్థలు పడుతున్నాం. గతంలో అనేక మార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా ఇప్పటి వరకు ఫలితం లేదు. బస్ షెల్టర్లేక పోవడంతో అధిక డబ్బులు చెల్లించి ఆటోల్లో పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.ఆర్టీసీ అధికారులు అర్రాస్పెంటలో తక్షణమే బస్టాప్ ఏర్పాటు చేయాలి. –కాలేరు రాజు(నెహ్రునగర్)
ప్రతిపాదనలు పంపించాం…
హర్రాస్పెంటలో బస్ షెల్టర్ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. ఈ ప్రాంతంలో బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నాతాధిరులకు ప్రతిపాదనలు పంపించారు. ఆర్టీసీ ఉన్నాతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే వెంటనే హర్రాస్పెంటలో బస్ షెల్టర్ లేక ఏర్పాటు చేస్తాం. –శ్రీనివాస్‌రావు(కాచిగూడ డిపో మేనేజర్)