సిటీబ్యూరో, మార్చి 22(నమస్తే తెలంగాణ) : ‘రోజూ 5 ప్రశ్నలు చదవండి.. సులువుగా ఉద్యోగం సంపాదించండి’. అనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ ఖాజా(2013 బ్యాచ్) పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికోసం వినూత్న కార్యాచరణ రూపొందించాడు. నిరుద్యోగుల కోసం ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రాం, యూట్యూబ్ ద్వారా విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఖాజా నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా.. వారు కూడా అంగీకరించారు. ప్రస్తుతం గ్రూప్ -1,2 పరీక్షలకు సిద్ధమవుతున్న ఖాజా సోమవారం నుంచి తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు.
మొదటిరోజే 20 వేల మంది వీక్షణ..
మొదటి రోజే ఖాజా ప్రయత్నానికి 20 వేల మంది నుంచి మద్దతు లభించింది. సోమవారం తెలంగాణ జాగ్రఫీ నుంచి ఐదు ప్రశ్నలు, ట్రాఫిక్ సూచనగా మద్యం సేవించి బండి నడిపి వ్యక్తి మరణానికి కారణమైతే సెక్షన్ 304 పార్ట్-2 కింద ఐపీసీ ప్రకారం 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపే పోస్టర్ను తయారు చేసి సైబరాబాద్ ట్రాఫిక్ ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలీగ్రాం, ఫేస్ బుక్, యూట్యూబ్ వేదికల్లో పోస్ట్ పెట్టాడు. ఇలా ప్రతి రోజు పోటీ పరీక్షల ప్రశ్నలతో పాటు ఓ ట్రాఫిక్ సూచనను ప్రచారం చేసి యువతను పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలుపుతానని ఖాజా పేర్కొన్నాడు. అదే విధంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తానని తెలిపాడు. అయితే ఖాజా ప్రయత్నానికి ట్రాఫిక్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్ నరసింహారెడ్డితో పాటు తోటి సిబ్బంది సహకారం అందిస్తున్నారు.
ఐదు ప్రశ్నలు.. ఒక సూచన..!
పోటీ పరీక్షల్లో ఉపయోగపడే ఐదు ప్రశ్నలను రూపొందించి, వాటితో పాటు ఓ ట్రాఫిక్ అవగాహన సూచనను ప్రతి రోజు పోస్టు చేయాలని నిర్ణయించుకున్నాడు. స్టడీ మెటీరియల్తో పాటు పాత పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల్లోని పలు ప్రశ్నలను మల్టిపుల్ చాయిస్ కింద పోస్టు చేసి, మరుసటి రోజు వాటికి సంబంధించిన సమాధానం అదే వేదికగా పోస్టు చేస్తున్నాడు. ఇలా నిరుద్యోగులు, యువతకు పలు కీలక అంశాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాడు.