– సిటీబ్యూరో, మార్చి 18(నమస్తే తెలంగాణ): ‘క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టండి.. భారీగా సంపాదించవచ్చు’.. ఇలా తరచూ సెల్ఫోన్లు, ఈ-మెయిల్స్‌కు వివిధ రకాల ప్రకటనలు వస్తుంటాయి. అయితే ఈ డిజిటల్ కరెన్సీలో భారీగా సంపాదించామనే వారి కంటే.. మోసపోయిన బాధితుల సంఖ్యే ఎక్కువగా ఉంటున్నది. సొత్తు పోయాకా..వాటిని ఎలా రికవరీ చేయాలి..? ఎవరు బాధ్యత తీసుకుంటారు.. అనే విషయాలు ప్రశ్నార్థకంగా మారాయి. పైగా క్రిప్టో పేరిట సైబర్ చీటర్స్ మరింతగా రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా మోసాలకు పాల్పడుతున్నారు. సులువుగా వ్యాలెట్లను హ్యాక్ చేస్తున్నారు. అందుకే క్రిప్టో జోలికి పోకపోవడమే మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.
క్రిప్టో కరెన్సీ అంటే ఒక బిట్ కాయిన్ మాత్రమే కాదు.. లైట్‌కాయిన్, ఇతెరియం, కార్డానో, డాగికాయిన్, బియాన్స్ కాయిన్ ఇలా చాలా పేర్లతో డిజిటల్ కరెన్సీ ఇప్పుడు మార్కెట్లో కొనసాగుతున్నాయి. అయితే చీటర్స్ అమాయకులను ఎలా మభ్యపెట్టి..ముంచుతారంటే.. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే.. రెట్టింపు చేస్తామని, ఇంకొందరు క్రిప్టో కొని.. ఖాతాను అప్పగిస్తే.. ట్రేడింగ్ చేసి.. లాభాలు ఇస్తామని మోసాలకు పాల్పడుతుంటారు. అంతే కాదు..పేరున్న క్రిప్టో ఎక్సేంజ్‌లకు సంబంధించిన వెబ్సైట్ల నుంచి కరెన్సీ కొని వ్యాలెట్లలో దాచుకున్న వాటిని హ్యాక్ చేసి.. కొట్టేసే ముఠాలూ ఉన్నాయి.
కరెన్సీ కొనగానే తెలిసిపోతుందా..
క్రిప్టో కరెన్సీనిని ఒకరు కొనుగోలు చేశారంటే.. ఆ సమాచారం సైబర్‌నేరగాళ్లకు తెలిసిపోతున్నది. వెంటనే వారికి మీ కరెన్సీ ట్రేడింగ్ చేసి.. లాభాలిస్తామంటూ సందేశాలు పంపి.. వల వేస్తున్నారు. తొలుత తక్కువ మొత్తంలో పెట్టించి.. కొంత లాభాలను చూపిస్తున్నారు. ఆ తర్వాత ఎక్కువ పెట్టుబడులు పెట్టేలా చేసి.. నిండాముంచేస్తున్నారు. మరోవైపు క్రిప్టో కరెన్సీ కొనే వారికి సంబంధించిన డేటాను సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాలెట్లను హ్యాక్ చేస్తున్నారు. కీ లాగర్స్ పంపించి ఆన్లైన్ బ్యాంకింగ్‌లను కూడా హ్యాక్ చేస్తున్నట్లు వెల్లడైంది.
నిండా ముంచేస్తున్నారు..
క్రిప్టో కరెన్సీకి మన దేశంలో గుర్తింపు లేదు. దీనిని ఆసరాగా చేసుకుంటున్న సైబర్‌నేరగాళ్లు పలు విధాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. మొదట్లో ఎక్కువ లాభాలు చూపించి.. తరువాత భారీ పెట్టుబడులు పెట్టించి నిండా ముంచేస్తున్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. అసలు దాని జోలికి పోకపోవడమే మంచిది.
– కేవీఎం ప్రసాద్, సైబర్ క్రైమ్స్ ఏసీపీ