ముషీరాబాద్, మార్చి 14 : ముషీరాబాద్ నియోజకవర్గం హిందిమహావిద్యాలయం-వీఎస్టీ మార్గంలో నాగమయ్యకుంట వద్ద నాలాపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పక్షం రోజుల క్రితం ప్రారంభించిన బ్రిడ్జి నిర్మాణం వచ్చే వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానికంగా వరద ముంపు సమస్యకు పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ స్టాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రొగ్రాంలో భాగంగా రూ.13 కోట్ల వ్యయంతో నాగమయ్యకుంట వద్ద ప్రధాన నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలు పెట్టారు. ప్రస్తుతం వీఎస్టీ వైపు నుంచి హిందిమహా విద్యాలయం వైపు ట్రాఫిక్ మళ్లించి పను లు చేపడుతున్నారు. ఒక వైపు నిర్మాణం పూర్తైన తరువాత మరోవైపు పనులు చేపట్టనున్నారు.
వరద ముంపునకు పరిష్కారం..
నాగమయ్యకుంట, పద్మకాలనీ హెరిటేజ్ భవనం వద్ద ఇరుకుగా మారిన నాలా(వంతెన)ను విస్తరించి, బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు. దీంతో త్వరలో రెండు బస్తీలకు వరద ముంపు సమస్య పరిష్కారం కానుంది. నాగమయ్యకుంట వద్ద తూములను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో 12 మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపడతారు. దీంతో భారీ వర్షం కురిసినా వచ్చిన వరద వచ్చినట్లుగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో దశాబ్దాలుగా ఎదురవుతున్న వరద నీటి ఇక్కట్లు నాగమయ్యకుంట వాసులకు తొలగిపోయే అవకాశం ఉంది.
వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తాం..
నాగమయ్యకుంట నాలాపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వర్షాకాలం నాటికి పూర్తి చేస్తాం. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పను లు ముమ్మరంగా చేపట్టడం జరుగుతుంది. గడువులోగా పనులు పూర్తి చేసేలా స్వయంగా పర్యవేక్షిస్తున్నాం.
-ముఠా గోపాల్, ఎమ్మెల్యే ముషీరాబాద్