బొల్లారం, మార్చి 13 : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు.ఆదివారం కంటోన్మెంట్ ఎనిమిదో వారు ్డ పరిధిలోని అయోధ్యనగర్,మందాబాద్,అన్నానగర్ లో పర్యటించి స్థానికంగా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా బస్తీవాసులు డ్రైనేజీ,గతంలో వచ్చిన అధిక తాగునీటి బిల్లులు, పెన్షన్లు,రేషన్ కార్డుల వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన సాయన్న డ్రైనేజీ,మంచి నీటి బిల్లుల సమస్యలను కంటోన్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను బస్తీవాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.దేశంలో ఎక్కడాలేని విధంగా జీహెచ్ఎంసీ తో పాటు కంటోన్మెంట్ లోనూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.
ప్రభుత్వం కల్పించిన జీఓ నంబర్ 58,59 స్థలాల క్రమబద్ధీకరణను గడువులోగా సరిచేసుకోవాలని సూచించారు. ఆర్థికంగా బలోపేతం చెందేందుకు దళితబంధు పథకం, వచ్చే నెల నుంచి సొంత స్థలం ఉంటే రూ.3లక్షల వరకు ప్రభుత్వ ఆర్థిక సహాయం,విద్యార్థులకు గురుకుల పాఠశాలలు వంటి ఎన్నో బృహత్తర కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయ ప్రకాష్,మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్,వేణు గోపాల్‌రెడ్డి, దేవులపల్లి శ్రీనివాస్, హెచ్ఎన్ శ్రీనివాస్,కుమార్,చందర్ బస్తీవాసులు నర్సింహులు,లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.