సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ): అతివలను కంటికి రెప్పలా కాపాడుతున్న షీటీమ్స్.. ఇప్పుడు సోషల్‌మీడియాలోనూ వేధించే పోకిరీల భరతం పడుతున్నాయి. డిజిటల్ దునియాలో మహిళల భద్రత కోసం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర దేశంలోనే మొదటిసారిగా ప్రారంభించిన ఆన్లైన్లో ‘షీటీమ్స్’ గస్తీ సత్ఫలితాలు ఇస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఇలా..
సైబరాబాద్ షీ టీమ్స్‌కు చెందిన 11 బృందాలకు చెందిన అధికారులు సోషల్ మీడియా వేదికలైనా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్, పలు వాట్సాప్ గ్రూపులు, డేటింగ్ యాప్‌లపై నిఘాపెట్టారు. నిరంతరం వాటిని మానిటర్ చేస్తున్నారు. మహిళలు, అమ్మాయిలను టార్గెట్ చేసుకుని పోస్టింగ్‌లు, ఫొటోలు, వీడియోలను పెట్టే వారి భరతం పడుతున్నారు.
50 మందిపై కేసులు…
సైబరాబాద్ షీ టీమ్స్ చేపట్టిన ఆన్లైన్ గస్తీతో ఇప్పటి వరకు దాదాపు 50 మంది పోకిరీలు చిక్కారు. కుటుంబసభ్యుల సమక్షంలో వారికి కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. రెండో సారి చిక్కితే ఇక జైలు తప్పదని హెచ్చరించారు.
24/7
బస్సు స్టాప్‌లు, కాలేజీలు, మెట్రో రైలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి.. పోకిరీలను పట్టుకున్నాయి. ఇప్పుడు మొదటి సారి ఆన్‌లైన్‌లోనూ ఎంట్రీ ఇచ్చాయి. సోషల్ మీడియాలో ఎవరూ పట్టుకుంటారులే అనే ధీమాతో ఉన్న వారికి ఊచలు లెక్కించడం తప్పదని.. హెచ్చరిస్తున్నాయి. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన 11 షీ టీమ్స్ బృందాలు సాధారణ విధులతో పాటు ఆన్లైన్ గస్తీని సైతం 24/7 నిర్వహిస్తున్నాయి. పోకిరీలు ఎవరైనా సోషల్ మీడియా వేదికల ద్వారా అమ్మాయిలను సతాయిస్తే బుద్ధి చెబుతున్నాయి.