ఖైరతాబాద్, మార్చి 12 : శిలాజ ఇంధనాలు అడుగంటి పోతున్నాయి…పెట్రోల్, డీజిల్ మరో దశాబ్ద కాలంలో అందకుండా పోతుంది. ఇలాంటి తరుణంలో సౌర విద్యుత్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందంటున్నారు మధ్యప్రదేశ్ ప్రభుత్వ సోలార్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్, ఎనర్జీ స్వరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఐఐటీ ముంబై ప్రొఫెసర్, సోలార్ మెన్ ఆఫ్ ఇండియా డాక్టర్ చేతన్‌సింగ్ సోలంకి. సౌర విద్యుత్ ఉత్పత్తిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేందుకు కంకణం కట్టుకున్నారు. ఎనర్జీ స్వరాజ్ పేరుతో భారతదేశ యాత్ర చేపట్టారు. శనివారం ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ వద్దకు చేరుకున్న బస్సు యాత్రకు ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, కార్యదర్శి డాక్టర్ జి. వెంకటసుబ్బయ్య, ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ చైర్మన్ శ్రీనివాసాచారి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం చైర్మన్ శంకర్లు స్వాగతం పలికారు.
డీజిల్ బస్సుకు సోలార్ ప్యానల్స్
సౌర విద్యుత్ ఉపయోగాలు, వినియోగంపై ప్రజలందరికీ అవగాహన కల్పించడమే డాక్టర్ చేతన్‌సింగ్ సోలంకి తన జీవితాశయంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్ బస్సును తీసుకొని.. దానికి సోలార్ ప్యానళ్లను అమర్చారు. వాటి ద్వారా వచ్చే విద్యుత్‌ను బస్సులోని ఎలక్ట్రానిక్ పరికరాలకు వినియోగించునేలా ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అందులోనే బాత్ రూమ్, బెడ్ రూమ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. భోపాల్ నుంచి 2020 నవంబర్ 26న బస్సులో యాత్ర ప్రారంభించారు. ఈ బస్సులోని సోలార్ ప్యానెళ్ల ద్వారా 3.2 కేవీ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఇన్వర్టర్ ద్వారా విద్యుత్‌ను స్టోరేజీ సైతం చేసుకోవడంతో పాటు 6 కేవీహెచ్ (కిలోవాట్ పర్ హవర్) కరెంటునూ వాడుకోవచ్చు. తద్వారా లైట్స్, కుక్కర్, టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ వినియోగించుకోవచ్చు. కాగా, ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేంత వరకు 2030 వరకు యాత్ర కొనసాగుతుంది చేతన్‌సింగ్ చెప్పారు. అప్పటివరకు ఇంటి ముఖం చూడనని ప్రతినబూనారు.