నామినేటెడ్ సభ్యుడి వైఖరితో విసిగిపోతున్న క్యాడర్
గులాబీలోకి సదాకు సై, జంపనకు నై
త్వరలో మరికొందరు వీరి బాటలోనే..!
సికింద్రాబాద్, మార్చి 11: కంటోన్మెంట్ నియోజకవర్గంలోని బీజేపీలో వర్గపోరు ముదిరి పాకానపడుతున్నది. పార్టీలోని నేతలు మూడువర్గాలుగా విడిపోయి, ఎవరికి వారుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకోవడంతోనే కాలం గడుపుతున్నారు.
జాతీయ స్థాయిలో ప్రధాన భూమిక పోషిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే పార్టీలోకి వచ్చే ప్రతిఒక్కరినీ ఆహ్వానించింది. దీంతో ‘మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు’గా తయారైంది ఆ పార్టీ పరిస్థితి. ఇటీవల బీజేపీ మహంకాళి జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆకుల నాగేశ్‌ను క్రమశిక్షణ పేరుతో పార్టీ సస్పెండ్ చేసింది. ఈ సెస్పెన్షన్ వెనుక కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కీలక భూమిక పోషించాడని బాహటంగానే విమర్శలు గుప్పించారు.
పార్టీని వీడనున్న ఇద్దరు మాజీ ఉపాధ్యక్షులు
కంటోన్మెంట్లో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తీరుతో విసుగెత్తి పార్టీని వీడేందుకు ఇద్దరు మాజీ ఉపాధ్యక్షులు సదా కేశవరెడ్డి, జంపన ప్రతాప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండో వార్డులో తనకు తెలియకుండా సొంతంగా అభివృద్ధి పనులు చేయిస్తున్నానని ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే వార్డులో తిరుగుతుండటంపై సదా కేశవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం నుంచి ఇరువురు నేతలకు అసలు పొసగదు. ఈ కారణంగానే మరోసారి ఇరువురు మధ్య ప్రచన్న యుద్ధం జరుగుతుంది. దీంట్లో భాగంగానే పార్టీని వీడుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.మరోవైపు జంపన ప్రతాప్ కూడా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలతో గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సదా కేశవరెడ్డి గులాబీ గూటికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా అధిష్టానం సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు జంపన ప్రతాప్ కూడా కారెక్కేందుకు చూస్తుండగా టీఆర్ఎస్ పెద్దలు మాత్రం ససేమిరా అని తేల్చి చెప్పినట్లు వినికిడి. గతంలో జరిగిన బోర్డు ఎన్నికల్లో 1, 3వ వార్డుల్లో పోటీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చినా రెండు స్థానాల్లోనూ ఓటమి పాలు కావడంతో పాటు అనంతరం పార్టీని వీడటంపై పార్టీ పెద్దలు ఇంకా గుర్రుగానే ఉన్నారు. మరోవైపు జంపనను పార్టీలోకి తెచ్చేందుకు యత్నించిన ఇరువురు నేతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మం దలించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కారులో చోటు లేకపోవడంతో హస్తం గూటికి వెళ్లేందుకు జంపన మార్గం చూసుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఈ క్రమం లో బీజేపీ పార్టీ కేడర్ దిక్కుతోచని స్థితిలో పడింది. దీంతో వీరి బాటలోనే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
రామకృష్ణపై గుర్రుగా అధిష్టానం..
కంటోన్మెంట్‌లోని పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిన సమయంలో నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఒంటెద్దు పోకడలతో పాటు గ్రూపు రాజకీయాలకు తెరలేపడంపై అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీని ఒక్కొక్కరుగా వీడడంలో రామకృష్ణ తీరే ప్రధాన కారణంగా బయటకు వెళ్తున్న నేతలు చేస్తున్న కామెంట్లపై కాషాయ పెద్దలు దృష్టి సారించారు. చూడాలి మరి రామకృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.