కూల్చివేతలు చేపట్టిన అధికారులు
అడ్డుకునేందుకు ప్రయత్నాలు.. ఉద్రిక్తత
పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేతలు
బంజారాహిల్స్,మార్చి 11: బంజారాహిల్స్ రోడ్ నంబర్- 12లోని ఎన్బీటీనగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో వెలసిన ఆక్రమణలను రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. షేక్‌పేట మండలం సర్వే నంబర్ 403లోని ఎకరం స్థలాన్ని మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కోసం కేటాయించారు. ఈ స్థలంలో రూ.2 కోట్లతో ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ గతంలో శంకుస్థాపన చేశారు. అయితే, కొండ ప్రాంతం కావడంతో నిధులు ఎక్కువగా అవసరం ఉంటుందని జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చెప్పడంతో పనులు ప్రారంభించలేదు. దీంతో సదరు స్థలంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తిష్ట వేశారు. సుమారు 2000 గజాల స్థలంలో కొన్ని గుడిసెలు వేయించడంతో పాటు వారం క్రితం స్థలం చుట్టూ ప్రహరీ నిర్మాణం కూడా చేపట్టారు. స్థలం వద్దకు వెళ్లిన అధికారులతో గొడవలకు దిగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇటీవల జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పర్యటించిన సమయంలో అక్కడి ఆక్రమణలను గుర్తించారు. ఈ స్థలాన్ని కాపాడాలంటూ మంత్రి కేటీఆర్‌కు కొంతమంది స్థానికులు కూడా ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు శుక్రవారం షేక్‌పేట మండల రెవెన్యూ, జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు రంగంలోకి దిగి కూల్చివేతలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రహరీని జేసీబీ సహాయంతో కూల్చేశారు. అక్కడున్న వారు అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ స్థలాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించామని, ఇక్కడ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టనున్నారని అధికారులు తెలిపారు. అయినా, వారు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి వారందరినీ అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. ఇదిలాఉండగా, ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59 కింద గుడిసెలు వేసుకున్న కొంతమంది స్థలాన్ని క్రమబద్ధీకరణ చేయించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ కోసం కేటాయించిన స్థలంలో క్రమబద్ధీకరణ చేసే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తామని జోనల్ కమిషనర్ హామీ ఇచ్చారు.