బంజారాహిల్స్, మార్చి 10 : ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, జీవో 59 కింద దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం షేక్‌పేట మండల పరిధిలో ముమ్మరంగా సాగుతున్నది. మండల పరిధిలో ఇప్పటికే 751 దరఖాస్తులు వచ్చాయి. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో రెండు బృందాలు పర్యటిస్తున్నాయి. బుధవారం నాటికి 79 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.
18 బస్తీలో పాగా వేసేందుకు..!
ఒకవైపు క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలన కోసం అధికారులు పర్యటిస్తుండగానే.. మరోవైపు ప్రభుత్వ స్థలాల్లో తిష్టవేసి పట్టాలు దక్కించుకునేందుకు మరికొంతమంది ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఫిలింనగర్‌లోని 18 బస్తీల్లో ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ఎలాగైనా ఒక గుడిసె వేయడం లేదా తాత్కాలిక నిర్మాణం చూపించి పట్టాలు పొందేందుకు పథకం వేస్తున్నారు.
వాటిని తొలగించారు.!
పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో ఇటీవల పెద్ద సంఖ్యలో గుడిసెలు వేయగా రెవెన్యూ సిబ్బంది కూల్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా బస్తీలో మరో మూడు గుడిసెలు వేసినట్లు సమాచారం అందుకున్న షేక్‌పేట మండల తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు వాటిని కూల్చేశారు.
2014 జూన్ 2వ తేదీ కంటే ముందు వాటికే..!
ఇటీవల జారీ చేసిన జీవో 58 , జీవో 59 ప్రకారం 2014 జూన్ 2వ తేదీ కంటే ముందుగానే ఉన్న ఇండ్లకు మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుందని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే కొంతమంది బస్తీ లీడర్లు అత్యుత్సాహం, అతితెలివి చూపిస్తూ వేరే ప్రాంతంలోని పాత కరెంట్ బిల్లుల పేరుతో క్రమబద్ధీకరణ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడురోజుల కిందట ఫిలింనగర్‌లోని బీజేఆర్నగర్ బస్తీలో ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా రెవెన్యూ సిబ్బంది కూల్చేశారు.
కొత్తగా నిర్మాణాలు చేస్తే ఊపేక్షించేది లేదు..
షేక్‌పేట మండల పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో కొత్తగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. 2014 కంటే ముందుగా ఆక్రమణలో ఉన్న అభ్యంతరాలు లేని స్థలాలనే క్రమబద్ధీకరణ చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. పట్టాలను పొందేందుకు ఖాళీ స్థలాల్లో తాత్కాలిక నిర్మాణాలు వేస్తున్నారని సమాచారం వస్తున్నది. అలాంటి స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో క్రమబద్ధీకరించేది లేదు. ప్రభుత్వ స్థలాల్లో కొత్తగా వెలిసే నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుంది.
– శ్రీనివాస్‌రెడ్డి, షేక్‌పేట మండల తాసీల్దార్