మారేడ్‌పల్లి, మార్చి 9: ఒక్కగానొక్క కుమారుడి కోసం దుస్తులు, ఇష్టమైన వస్తువులు కొని.. ఆస్ట్రేలియాకు వెళ్లేందుకు సిద్ధమైన ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ ఇకలేడని తెలిసి..హతాశులయ్యారు. తీరని విషాదంలో మునిగిపోయారు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యను పూర్తి చేసి..ఇటీవలే ఉద్యోగంలో చేరిన నగరానికి చెందిన ఓ యువకుడు స్విమ్మింగ్‌పూల్‌లో పడి దుర్మరణం పాలయ్యాడు. సికింద్రాబాద్ రెజిమెంటల్‌బజార్‌కు చెందిన ఆర్. శ్రీనివాస్, అరుణల కుమారుడు సాయిసూర్య తేజ బీటెక్ పూర్తి చేసి.. 2019లో ఎంఎస్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. రెండు నెలల కిందట చదువు పూర్తి కావడంతో సివిల్ ఇంజినీర్‌గా అక్కడ ఉద్యోగంలో చేరాడు.
ఈ నెల 7న ఆస్ట్రేలియా బ్రిస్బన్లోని తాను నివాసముండే గోల్డెన్ కాస్ట్ రిసార్ట్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ప్రమాదవశాత్తు పడి మరణించాడు. గతంలో ప్రమాదంలో గాయపడిన సాయి సూర్యకు వచ్చే నెలలో కాలికి శస్త్ర చికిత్స చేయాల్సి ఉండటంతో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 2న వెళ్లేందుకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. సాయి సూర్య తనకు ఇష్టమైన సూట్ తీసుకు రమ్మని.. తల్లిదండ్రులకు చెప్పాడు. తన స్నేహితుల కోసం ఖాదీ చొక్కాలు కూడా తీసుకురమ్మన్నాడు. ఇంతలోనే కుమారుడి మరణ వార్త తల్లిదండ్రుల గుండెలను పిండేసింది. సూర్య తేజ పార్థివదేహం 14 లేదా15న నగరానికి చేరుకునే అవకాశం ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.