ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
ఖైరతాబాద్, మార్చి 7 ;కరోనా, లాక్డౌన్ నేపథ్యంలో ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో అనేక హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా ఫుడ్ ఇండస్ట్రీ అతలాకుతలంగా మారింది. అనేక హోటళ్లు మూతపడ్డాయి. దీంతో జీహెచ్ఎంసీకి ట్రేడ్ లైసెన్సు చెల్లింపుల్లోనూ జాప్యం ఏర్పడింది. గడిచిన రెండు నెలలుగా సాధారణ పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో నగరాభివృద్ధి ఆదాయ వనరులో ఒకటైన ట్రేడ్ లైసెన్సుల వసూళ్లకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది.
అందుబాటులో వెబ్సైట్ ఆప్షన్
ట్రేడ్ లైసెన్సుల రెన్యూవల్ కోసం జీహెచ్ఎంసీ వెబ్సైట్ ఆప్షన్‌ను అందుబాటులో ఉచ్చింది. సర్కిల్ పరిధిలో 9వేలకు పైగా అసెస్మెంట్లు ఉండగా, ఆఫ్‌లైన్, ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది. ట్రేడ్ లైసెన్సు మ్యానువల్‌గా వసూలు చేసేందుకు వార్డుకు ఏఎంవోహెచ్ పర్యవేక్షణలో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్, జవాన్లతో కలిసి మొత్తం ఐదు మందితో టీమ్‌ను కేటాయించారు. ట్రేడ్‌లైసెన్సుల కోసం ఇప్పటికే రిజిస్టర్ అయిన ఉన్న వ్యాపార కేంద్రాలకు బల్క్ మెసేజ్‌లు సైతం పంపించారు.
గడువు దాటితే 25 నుంచి 50 శాతం వరకు జరిమానా
సర్కిల్లో పెద్ద ఎత్తున ట్రేడ్ లైసెన్సు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య కేంద్రాల వారు ఈ నెల 31లోగా రెన్యూవల్ చేసుకోవాలి. గడువు తేదీలోపు చెల్లించకుంటే ఏప్రిల్ నెలలో 25 శాతం, మే నెల నుంచి 50 శాతం వరకు జరిమానా ఉంటుందన్నారు. మరో 20రోజుల సమయం ఉండటంతో తక్షణమే రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు.
-డాక్టర్ భార్గవ్ నారాయణ, ఏఎంవోహెచ్, సర్కిల్ 17