సుల్తాన్‌బజార్, మార్చి 5: కష్టపడితే సాధ్యం కానిదేది లేదని నిరూపించారు. ఓ పక్క చదువుతూనే, మరోవైపు ఉద్యోగాన్వేషణకు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసి ప్రస్తుతం ఉద్యోగానికి ఎంపికై శిక్షణ తీసుకుంటున్నారు ఇద్దరు విద్యార్థులు. కొమురం భీం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన అభినవ్ బాలా, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎర్రోళ్ల ఆకాష్‌లు భారత నౌకాదళంలో సీనియర్ సెకండరీ రిక్రూట్‌లో ఎంపికయ్యారు. వీరిద్దరు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, పీజీ కళాశాల సైఫాబాద్‌లో బీఎస్సీ సెకండియర్ అభ్యసిస్తున్నారు. వీరు కళాశాలలోని తెలంగాణ 3టీ బెటాలియన్ ఎన్సీసీలో రెండేండ్లపాటు క్యాడెట్లుగా శిక్షణ పొందారు. ఇటీవల ఇండియన్ వేవీలో సీనియర్ సెకండరీ రిక్రూట్‌కు ఎంపికై ప్రస్తుతం ఒడిషా రాష్ట్రంలోని చిలుకా శిక్షణ పొందుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సైఫాబాద్ సైన్స్ కళాశాల ఎన్సీసీ నుంచి ఇద్దరు విద్యార్థులు నేవీకి ఎంపిక కావడంపై ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌యాదవ్, రిజిస్ట్రార్ ప్రొ. లక్ష్మీనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ జే.లక్ష్మీనారాయణ, తెలంగాణ 3టి బెటాలియన్ కమాండెంట్ ఆఫీసర్ కల్నల్ టి శ్రీనివాస్, ఎస్సీసీ కోఆర్డినేటర్, డాక్టర్ పల్లాటి నరేష్ ఆనందం వ్యక్తం చేసి అభినందించారు.
కుగ్రామం నుంచి భారత నౌకాదళానికి..
వ్యవసాయ జీవనం, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు విద్యార్థులు చిన్ననాటి నుంచే విద్యపై మక్కువతో ప్రతి తరగతిలో ప్రథమస్థానంలో రాణిస్తున్నారు. అటు చదువుతూనే ఎస్‌సీసీలో చేరారు. ఎంతో శ్రద్ధతో ఎన్సీసీలో శిక్షణ పొందిన రెండో సంవత్సరంలోనే నేవీలో ఉద్యోగాలు లభించడం తోటి విద్యార్థులకు మరింత ఉత్సాహం ఇచ్చినట్లయ్యింది.