కీసర, ఫిబ్రవరి 27 : కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలో వేదపండితులు భవానీ రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొదటిరోజు పూజా కార్యక్రమాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ స్వామి వారికి విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవాచనం, పంచగవ్యస్థాపన, ఋత్విక్ వరణం, యాగశాల ప్రవేశం, ఆఖండ జ్యోతి ప్రతిష్ఠాపన వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పాఠశాలకు చెందిన పండితులు, కీసరగుట్ట ఆలయ వేదపండితులు మారుతీ సత్యనారాయణశర్మ, బాల్రాంశర్మ, రవిశర్మ, వీరేశం శర్మ చైర్మన్‌తో కలిసి యాగశాల ప్రవేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి, కీసర ఎంపీపీ ఇందిర లక్ష్మీనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశ్, సర్పంచ్ మాధురి వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ భద్రారెడ్డి, ఆలయ ధర్మకర్తలు శ్రావన్కుమార్గుప్త, దుర్గం సాయినాథ్‌గౌడ్, రమేశ్‌యాదవ్, బుచ్చిరెడ్డి, బాల్‌రెడ్డి, మల్లారెడ్డి, నరేశ్‌గౌడ్, ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు తటాకం నారాయణశర్మ, టి.రమేశ్, టి. వెంకటేశ్, శ్రీనివాస్, నాగలింగంశర్మ, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్టాల్స్‌ను ప్రారంభించిన మంత్రి …
కీసరగుట్టలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి మల్లారెడ్డి ఆదివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.
కీసరగుట్టలో నేడు జరిగే పూజలు ..
కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు రుద్రస్వాహాకార హోమం, సాయంత్రం 4గంటలకు బిల్వార్చన, రాత్రి 7గంటలకు ప్రదోషకాల పూజ, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు శ్రీ స్వామి వారు కీసర గ్రామం నుంచి కీసరగుట్టకు విచ్చేయుట, రాత్రి 9.30 గంటలకు ధనిష్ట నక్షత్రయుక్త మకర లగ్నమందు శ్రీ భవానీ శివదుర్గా సమేత రామలింగేశ్వరస్వామి వార్ల కల్యాణ మహోత్సవం వేడుకలను నిర్వహించనున్నారు.
ఆరోగ్య ప్రదర్శనశాల ప్రారంభం..
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టపై జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు వైద్య సేవలు అందించే విధంగా వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్స కేంద్రంతో పాటు ఆరోగ్య ప్రదర్శనశాలను ఆదివారం ఏర్పాటు ఈ ప్రదర్శనశాలను ప్రారంభించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రదర్శనశాలను ఏర్పాటు చేసిన వైద్యాధికారి మల్లికార్జునరావు, జిల్లా మాస్ మీడియా అధికారి జి. వేణుగోపాల్‌రెడ్డిని అభినందించారు.