హిమాయత్‌నగర్, ఫిబ్రవరి 18: సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు రోజుకో కొత్త ఎత్తుగడ వేస్తూ సులభంగా డబ్బులు సంపాదించుకునేందుకు అవకాశం ఉన్న ప్రతిదాన్ని వినియోగిస్తున్నారు. మొదట మాటల్లో దించి.. నమ్మించి నిండా ముంచేస్తున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు పట్టించుకోకుండా ఎలాంటి విద్యార్హత లేని సైబర్ మాయగాళ్ల బారిన పడి మోసపోయి డబ్బులు పోగొట్టుకుని ఆర్థికంగా కొట్టు మిట్టాడుతున్నారు.ఉన్నత విద్యావంతులు, వ్యాపారస్తులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతుండటం గమనార్హం. మేము ఆర్మీ అధికారులం, తక్కువ ధరకే ఐ ఫోన్, ఏటీఎం కార్డు, కేవైసీ అప్డేట్ అంటూ, రుణాలు ఇప్పిస్తామంటూ, బహుమతులు పంపిస్తున్నామంటూ అతి తక్కువ ధరకే బ్రాండెడ్ దుస్తులు, ఇళ్లు అద్దెకు కావాలంటూ ఇలా వివిధ పేర్లు చెప్పి నమ్మించి దోచేస్తున్నారు.
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండేందుకు నారాయణగూడ పోలీసులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. నారాయణగూడ,లిబర్టీ,హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, బర్కత్‌పుర, కింగ్‌కోఠి,రాంకోఠి తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, హాస్టల్స్, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, చౌరస్తాలు, బ్యాంకు లు, కాలనీలు, బస్తీలు తదితర ప్రాంతాలలో యువతీ, యువకులను కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేస్తున్నారు. ప్రతిరోజూ మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకొని సోషల్ మీడియా,యాప్‌ల వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి అవసరాన్ని వివరిస్తున్నారు.స్మార్ట్ ఫోన్లలో హాక్ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడంతో ఏదేని అనుకోని ఘటనలు చోటు చేసుకుంటే తమను తాము కాపాడుకునేందుకు హాక్ఐ యాప్ ఎంతో దోహద పడుతుందని సూచిస్తున్నారు. 100కు, 155260 నంబర్‌కు డయల్ చేయడం,హాక్ఐని వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి