సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 : జనాలను మభ్యపెట్టేందుకు కంటోన్మెంట్ పరిధిలో బీజేపీ నేతలు బస్తీబాట అంటూ తెల్లారేసరికి బస్తీల్లో ప్రత్యక్షమవుతున్నారు. ఇటీవల కాలంలోనే తాము బోర్డు పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని ప్రజలను నమ్మించేందుకు శక్తి వంచన లేకుండా యత్నిస్తున్నారు. రెండేళ్ల కిందట మంజూరైన పనులకు నిధుల లేమితో పనుల నిర్మాణానికి నోచుకోలేదు. కానీ నేడు నిధుల సమస్య కొలిక్కి వచ్చి పనులు ప్రారంభమవుతున్న సందర్భంలో తామే పనులు చేయిస్తున్నామని ఢంకా బజాయించుకునే పనిలో కాషాయపు నేతలు నిమగ్నమయ్యారు. రెండు రోజుల క్రితం బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ఒకటో వార్డులోని బాపూజీనగర్‌లో హిందూ శ్మశాన వాటిక పక్కనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను తానే మంజూరు చేయించానని జనాలను అయోమయానికి గురి చేస్తున్నాడు. గతంలో మంజూరైన పనులను తామే చేయిస్తున్నామంటూ బస్తీల్లో తిరుగుతూ శంకుస్థాపనలు చేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
రెండేళ్ల కిందటే పనులు మంజూరు
ఏడాది కిందట పలు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో నిధులు లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. బీజేపీలో చేరి నామినేటెడ్ పదవి తెచ్చుకున్న రామకృష్ణ తన డ్రామాలు మొదలుపెట్టి రాత్రికి రాత్రే సమస్యను గుర్తించి పనులు మంజూరు చేయించానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. బాపూజీనగర్ హిందూ శ్మశాన వాటిక పక్కనే ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు 2020 ఆక్టోబర్ 19న రూ. 13లక్షల 65వేల నిధులతో మంజూరు కాగా ,కాషాయ నేతలు మాత్రం రాత్రికి రాత్రే సాధించానని చెప్పుకోవడంపై జనం ముక్కున వేలేసుకుంటున్నారు.
నిధుల లేమితోనే.. పనుల్లో ఆలస్యం
రెండేళ్ల కిందటే కంటోన్మెంట్ బోర్డు పలు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. బోర్డులో నిధుల లేమితోనే పనులు పట్టాలెక్కలేదు. కానీ ఇటీవల కాలంలో కాషాయ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు బస్తీల్లో తిరుగుతూ అబద్ధపు ప్రచారాలకు తెర లేపుతున్నారు. గత రెండేళ్ల క్రితమే ఒకటో వార్డులో పలు అభివృద్ధి పనులు మంజూరు అయ్యాయి. సీసీ రోడ్లు, బీటీ అంతర్గత రహదారులు, భూగర్భ డ్రైనేజీ పనులకు సంబంధించి బోర్డు నుంచి మంజూరయినప్పటికీ, నిధులు లేకపోవడంతోనే పనుల్లో జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే కాషాయ నేతలు చెప్పులు అరిగేలా కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కమలం నేతలు జనాలను మభ్యపెట్టే కార్యక్రమానికి ఫుల్స్టాప్ పెట్టకపోతే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
– జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్ బోర్డు