అంబర్‌పేట, ఫిబ్రవరి 18 : అధునాతన సాంకేతికతను ఉపయోగించి అంబర్‌పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పా రు. బాగ్‌అంబర్‌పేట డివిజన్లోని వైభవ్‌నగర్ పార్కు, సోమసుందర్నగర్ పార్కులను డిజైన్ స్టూడియో కన్సల్టెన్సీతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో జరుగుతున్న పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పార్కుల సుందరీకరణలో నిపుణులైన డిజైన్ స్టూడియో కన్సల్టెన్సీ సభ్యులకు పార్కులో చేపట్టవలసిన పనులను వివరించారు. పార్కు మొదట్లో ఆర్చీ రావాలని, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం వివిధ రకాల మొక్కలు, ఫౌంటేన్ అదే విధంగా పిల్లలు, యువత కోసం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, వాటిలో ఉపయోగించే టైల్స్, ఫెన్సింగ్ గోడలకు చక్కటి పెయింటింగ్ వంటి అన్ని అంశాలను వివరించారు. పార్కులు సరికొత్త అందాలను సంతరించుకొని కాలనీలకే తలమానికంగా నిలిచేలా కృషి చేయాలని డిజైన్ స్టూడియో సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు. వైభవ్‌నగర్‌లో పాదయాత్ర నిర్వహించి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలో ఇటీవల డ్రైనేజీ పైపులైన్ పనులు పూర్తయ్యాయని, కానీ స్థానిక సీజన్స్ దవాఖానకు వచ్చిపోయే వారికి, కాలనీ వాసులకు రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నామని, కాలనీ లోతట్టు ప్రాంతంలో ఉండడంతో పక్కనే ఉన్న నందనవనంలోని డ్రైనేజీ నీరు భారీ వర్షాలకు తమ కాలనీలోకి వస్తుందని చెప్పారు. వెంటనే డ్రైనేజీ పనులు పూర్తిచేసి సీసీ రోడ్డు వేయించాలని కాలనీ వాసులు కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాజేశ్వరి, చంద్రశేఖర్, అన్నపూర్ణ, శాస్త్రి, గిరిజ, అరుణ, నాగేందర్, మధుసూదన్‌రెడ్డి, సాయిబాబ, డా. చారి, డా. మధుసూదన్, బాగ్‌అంబర్‌పేట డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రమోహన్, పార్టీ నాయకులు దిలీప్, మహేశ్, రవి, నరహరి తదితరులు పాల్గొన్నారు.