సిటీబ్యూరో, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ వేదికగా హుస్సేన్‌సాగర్ పరిసరాలలో ఫిబ్రవరి 11వ తేదీన ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఆటోమొబైల్(ఎఫ్ఐఏ), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్ రేసింగ్ పోటీలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ పోటీలకు ప్రపంచ నలుమూలల నుంచి 30 వేల నుంచి 35 వేల మంది వరకు ప్రేక్షకులు హాజరయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈ పోటీలకు సెక్యూరిటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న స్కాట్ అండ్రూస్ బృందం శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో చట్టాన్ని గౌరవించే పౌరులు, అభిమానులు ఉన్నారని స్కాట్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రత విస్తరణ, ట్రాఫిక్ మళ్లింపులు, క్రౌడ్ మేనేజ్మెంట్, ఆకస్మిక ప్రణాళికలు, పూర్తి సెక్యూరిటీకి సంబంధించి బ్లూ ప్రింట్‌పై చర్చించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత అత్యంత కీలకమైన అంశమని, ఎంట్రెన్స్, ఎగ్జిట్ పాయింట్లు హైలెట్ చేయాలని సూచించారు. అంతర్గత కదలికల్లో కఠినమైన నిఘా ఉండాలని, అన్ని పాయింట్ల వద్ద శిక్షణ పొందిన సిబ్బందిని నియమించాలని సూచించారు. పాస్‌లు, టికెట్స్ ట్యాంపర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నగర అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, ఏఆర్ శ్రీనివాస్, డీసీపీలు, తదితరులు పాల్గొన్నారు.